వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లిన సమయంలో పరిచయమైన సినీ నటి కాదంబరి జెత్వానీ.. ఆ తర్వాత ఆయనకు దగ్గరైంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో విద్యాసాగర్ వైసీపీ అగ్రనేతల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను విద్యాసాగర్ వదిలించుకునేందుకు వైసీపీ పెద్దలు కొందరు ఐపీఎస్ ల సాయంతో ఆమెను ముంబైకి వెళ్లి అరెస్టు చేసి విజయవాడ తెచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే ప్రభుత్వం విచారణకు ఆదేశించటంతో ఈరోజు విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబును జత్వానీ కలుస్తుందని సమాచారం. మొత్తం ఘటనపై నాలుగు రోజుల్లో విచారణ అధికారి స్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు. అయితే, గురువారం రాత్రే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమె.. రాత్రి హైదరాబాద్‌లో బస చేశారు.. ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నటి జత్వానీపై వేధింపుల కేసుని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఆమె నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే CMO ఆదేశాలు ఇచ్చింది. తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని జత్వానీ కోరింది. ఇక కాదంబరి జత్వానీ ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఆ తర్వాత ఆమెను ఏపీ పోలీసులు విజయవాడకు తీసుకువెళ్లనున్నారని తెలుస్తోంది. వేధింపుల వ్యవహారానికి సంబంధించి ఆమె స్టేట్ మెంట్‌ను రికార్డు చేసే అవకాశం ఉంది.
మరోవైపు.. తన దగ్గర ఉన్న ఆధారాలను ఏపీ ప్రభుత్వానికి అందిస్తానని తెలిపింది జత్వానీ. తనకు న్యాయం చేయాలని కోరుతోంది. న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెబుతోంది. తనపై 2014లో మల్టిపుల్ క్రిమినల్ కేసులు నమోదు చేశారని.. గత ప్రభుత్వ పెద్దలు తనను అట బొమ్మలా వాడుకున్నారని తెలిపింది. చట్ట వ్యతిరేకంగా కొందరు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చిత్ర హింసలకు గురిచేశారని ఆరోపిస్తోంది జత్వానీ.