ఐబొమ్మ పైరసీ కేసులో సిసిఎస్ పోలీసులు మొదట ఎనిమిది రోజులు, ఆపై 12 రోజులు, మొత్తం 20 రోజుల పాటు ఆయన్ను విచారించారు. ఈ విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. పోలీసుల దర్యాప్తులో ఐబొమ్మ సైట్లో పైరసీ సినిమాలతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని, తద్వారా భారీ మొత్తంలో డబ్బులు ఆర్జించారని ఆరోపణలు వచ్చాయి.
అయితే ఐ బొమ్మ రవి పోలీస్ కస్టడీ సోమవారంతో ముగియడంతో పోలీసులు రవిని ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. రవిని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ప్రశ్నలకు బదులుగా తిరిగి ప్రశ్నలు సంధించాడు.

అసలు ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు? నేను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు మీ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ? అని ప్రశ్నించాడు. పోలీసులు చెబితే నిజాలు అవుతాయా ? మీడియా కోర్టు కాదు నేను కోర్టులో మాట్లాడతానని సమాధానాలు ఇచ్చాడు. మీరు విదేశాలకు ఎందుకు పారిపోయారని, పైరసీ చేసినట్లు అంగీకరిస్తారా అని ప్రశ్నించగా.. తాను ఎక్కడికీ పారిపోలేదని కూకట్‌పల్లిలోనే ఉంటున్నాను అన్నాడు. – ఐ బొమ్మ రవిని విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు ప్రహ్లాద్ అనే స్నేహితుడి ధ్రువపత్రాలతో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు చెప్పిన రవి.. తీరా ప్రహ్లాద్‌ను విచారణకు పిలిచినప్పుడు మౌనంగా ఉన్నాడు. ప్రహ్లాద్‌ను రవి గురించి అడుగగా.. అతను ఎవరో కూడా తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. ప్రహ్లాద్ జీరాక్స్ పత్రాలు తస్కరించిన రవి.. తానే ప్రహ్లాద్లా ఫొటోను మాత్రమే మార్చి మీడియేటర్ల సహకారంతో పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

రవి వినియోగించిన బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. అంజయ్య అనే పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అతని గురించి ఆరా తీయగా.. అతను కూడా ఎవరో రవికి తెలియదు. రవి ఎవరో కూడా అంజయ్యకు తెలియదని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అతని ధ్రువపత్రాలు కూడా ఏదో మార్గంలో తస్కరించి ఫొటోను మార్చి బ్యాంకు అధికారులను ఏమార్చి బ్యాంకు ఖాతాలు తీసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
