టేస్టింగ్ సాల్ట్ సాధారణ పేరు మోనోసోడియం గ్లుటామేట్. ఇది చైనీస్ ఫుడ్ మరియు వివిధ రకాల మసాలాలతో సహా దేశీయ ఆహారం మరియు ఫాస్ట్ ఫుడ్లో విస్తృతంగా వాడుతున్నారు. టేస్టింగ్ సాల్ట్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినే వారికి ఇతర రుచులు అంతగా నచ్చవు. “చైనీస్” కాకుండా ఇతర ఆహారం వారికి తక్కువ రుచికరంగా అనిపించవచ్చు. వారు వివిధ సమస్యలపై దృష్టి కేంద్రీకరించలేరు. అయితే చైనీస్ వంటకాలు, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ తయారీలో దీనిని విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే రుచి కోసం వాడే ఈ పొడి శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.

ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..మెదడుపై ప్రభావం:- టేస్టింగ్ సాల్ట్ మెదడులోని నరాలను అతిగా ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల నరాల బలహీనత ఏర్పడవచ్చు. తరచుగా దీనిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గుండె ఆరోగ్యం:- ఇందులో సోడియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును అకస్మాత్తుగా పెంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా గుండె దడ, ఛాతీ నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులకు ఇది దారితీస్తుంది.
ఊబకాయం.. ఈ సాల్ట్ కలిపిన ఆహారాలు తిన్నప్పుడు ఆకలిని నియంత్రించే సంకేతాలు మెదడుకు అందవు. దీనివల్ల మనిషి అతిగా తింటాడు. ఫలితంగా శరీర బరువు వేగంగా పెరిగి ఊబకాయం బారిన పడతారు. హార్మోన్ల అసమతుల్యత.. చిన్న పిల్లలు, గర్భిణులు టేస్టింగ్ సాల్ట్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇది శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. థైరాయిడ్ వంటి సమస్యలకు ఇది ప్రధాన కారణం కావచ్చు.

ఇతర ఇబ్బందులు.. చాలా మందిలో టేస్టింగ్ సాల్ట్ తిన్న వెంటనే తలనొప్పి, చెమటలు పట్టడం, మొహం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. జీర్ణక్రియ మందగించడం, కడుపులో మంట వంటివి కూడా సహజం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రుచి కంటే ఆరోగ్యం ముఖ్యం. బయట దొరికే జంక్ ఫుడ్, నూడుల్స్, మంచూరియా వంటి పదార్థాలను తగ్గించాలి. ఇంట్లో వంట చేసేటప్పుడు సహజ సిద్ధమైన మసాలాలు, ఉప్పు మాత్రమే వాడటం శ్రేయస్కరం. ఆరోగ్యకరమైన జీవనం కోసం ఈ కృత్రిమ రుచులకు దూరంగా ఉండటం ఉత్తమ మార్గం.
