ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం వెనుక అనేక కారణాలుంటాయి. 99 శాతం మందికి ఈ విషయం ఎందుకు తెలియదంటే, దీని గురించి అవగాహన చాలా తక్కువ. గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ రుగ్మతలు, మెదడుకు సంబంధించిన పరిస్థితులు ఇలాంటి దురదృష్టకర సంఘటనలకు ప్రధాన కారణాలు. దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. దీర్ఘకాలిక గుండె వైఫల్యం ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న తీవ్ర సమస్యలలో ఒకటి. ఇది శరీర అవసరాలు తీర్చడానికి గుండె తగినంత రక్తం పంప్ చేయలేని పరిస్థితి.
ఈ పరిస్థితి క్రమంగా అభివృద్ధి చెందుతుంది. తరచుగా ప్రజలు ప్రారంభ లక్షణాలు విస్మరిస్తారు. దీని వలన వ్యాధి పురోగమిస్తుంది, తీవ్రంగా మారుతుంది. అయితే నిద్రలో మరణాలకు అత్యంత ప్రధాన కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్. గుండె రక్తనాళాల్లో పూడికలు లేదా గుండె లయ తప్పడం దీనికి దారితీస్తుంది. పగటిపూట ఛాతీలో అసౌకర్యం, కారణం లేని ఆయాసం లేదా గుండె దడ వంటివి దీని ముందస్తు హెచ్చరికలు. కాబట్టి క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకుంటూ BP, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు.
టైప్-1 డయాబెటిస్ ఉన్నవారికి రాత్రిపూట షుగర్ లెవల్స్ మరీ దారుణంగా పడిపోయే ప్రమాదం (Hypoglycemia) ఉంది. దీన్నే ‘డెడ్ ఇన్ బెడ్ సిండ్రోమ్’ అంటారు. నిద్రలో విపరీతంగా చెమటలు పట్టడం, పీడకలలు రావడం లేదా గందరగోళంగా అనిపించడం దీని లక్షణాలు. పడుకునే ముందు కచ్చితంగా షుగర్ చెక్ చేసుకోవడం, ఇన్సులిన్ డోసుల విషయంలో జాగ్రత్త వహించడం, గ్లూకోజ్ మానిటరింగ్ పరికరాలు వాడటం మేలు. చాలా మంది సాధారణంగా భావించే గురక వెనుక అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (OSA) దాగి ఉండొచ్చు. దీనివల్ల నిద్రలో శ్వాస పదే పదే ఆగిపోయి ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
పెద్దగా గురక పెట్టడం, రాత్రిపూట గాలి కోసం ఉక్కిరిబిక్కిరి అవ్వడం, పగలు విపరీతమైన అలసట దీని ముఖ్య లక్షణాలు. బరువు తగ్గడం, పడుకునే ముందు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, అవసరమైతే డాక్టర్ సలహాతో ‘CPAP’ మెషిన్‌ను వాడటం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చు. తీవ్రమైన ఆస్తమా లేదా COPD వంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి రాత్రిపూట ఆక్సిజన్ అందక ఇబ్బంది కలుగుతుంది. రాత్రిపూట విపరీతమైన దగ్గు, పిల్లికూతలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం దీని లక్షణాలు.
కాబట్టి డాక్టర్ సూచించిన ఇన్హేలర్లను దగ్గర ఉంచుకోవడం, బెడ్రూమ్లో దుమ్ము-ధూళి లేకుండా చూసుకోవడం అత్యవసరం. హై BP లేదా రక్తం గడ్డకట్టడం వల్ల నిద్రలోనే పక్షవాతం (Stroke) వచ్చే అవకాశం ఉంది. మూర్ఛ వ్యాధి (Epilepsy) ఉన్నవారికి నిద్రలో ఫిట్స్ వచ్చి ప్రాణాపాయం సంభవించే (SUDEP) రిస్క్ ఉంది. పడుకునే ముందు ఆకస్మికంగా తలనొప్పి, తల తిరగడం లేదా కాళ్లు చేతులు మొద్దుబారడం వంటివి డేంజర్ బెల్స్ లాంటివి. BPని కంట్రోల్లో ఉంచుకోవడమే స్ట్రోక్‌కు అసలైన మందు కాగా, మూర్ఛ వ్యాధి ఉన్నవారు మందులు అస్సలు మానకూడదు.
