తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఐబొమ్మరవి అరెస్ట్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగానే నిలుస్తోంది. కొంత మంది అతన్ని అభినవ రాబిన్ హుడ్‌గా అభివర్ణిస్తుంటే సినిమా వాళ్లు మాత్రం ఓ చీటర్‌గా చూస్తూ అతన్ని కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు. అయితే రవి అరెస్టు తర్వాత పైరసీ ఎక్కడా ఆగలేదు. కొత్తగా రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలూ ఎప్పట్లాగే పైరసీ అవుతున్నాయి. ఒక్క సినిమా కూడా పైరసీ అవ్వకుండా ఆగింది లేదు. మరి రవిని అరెస్టు చేసి పోలీసులు సాధించింది ఏంటి? అనే ప్రశ్న వస్తోంది.
అసలు పైరసీ ఎందుకు ఆగట్లేదు అనేది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే.. రవి.. ఏ కొత్త సినిమానూ డైరెక్టుగా పైరసీ చెయ్యలేదు. అంటే.. థియేటర్‌కి వెళ్లి.. రహస్యంగా వీడియో రికార్డులు చెయ్యడం వంటివి రవి చెయ్యలేదు. అతను ఇతర పైరసీ సైట్ల నుంచి పైరసీ సినిమాల్ని తీసుకొని.. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. అందువల్ల అసలు పైరసీ సైట్లు అలాగే ఉన్నాయి. వాటిని పోలీసులు బ్రేక్ చెయ్యలేకపోతున్నారు. రవి దొరకగానే.. అతనే పైరసీ కింగ్ అని చెప్పారు. కానీ.. అతను పైరసీ మాఫియాలో చిన్న పార్ట్ మాత్రమే.

మనకు ఇంకో డౌట్ రావచ్చు. ఓటీటీలో సినిమాల్ని అతను పైరసీ చేసేవాడు కదా. ఇక ఇప్పుడు ఆ పైరసీ ఆగిపోయినట్లే కదా అని. అంత లేదు. ఆ పైరసీ కూడా ఆగలేదు. రవి ఏం చేసేవాడంటే.. DRM టెక్నాలజీని వాడేవాడు. దీని ద్వారా ఓటీటీ సినిమాలను ప్లే చేస్తూ.. స్క్రీన్ రికార్డ్ చేసేవాడు. అదే సమయంలో.. ఆడియో కూడా రికార్డ్ అయ్యేది. అలా రికార్డ్ అయిన సినిమాల్ని ఐబొమ్మ, బొప్పం వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు. రవి అరెస్టు అయిన తర్వాత కూడా ఓటీటీ సినిమాలు పైరసీ అవుతూనే ఉన్నాయి. చాలా మంది DRMని వాడి.. పైరసీ చేస్తున్నారు. అంటే.. రవి అనే వ్యక్తి.. ఈ పైరసీ మాఫియాలో కింగ్ కాదు.
అతని అరెస్టుతో పోలీసులు సాధించేది ఏమీ లేదని తేలిపోతోంది. అసలైన పైరసీ సైట్లు నాలుగైదు ఉన్నాయని సమాచారం. అవి థియేటర్లలో పైరసీ చేస్తున్నాయి. వాటిని పట్టుకొని, క్లోజ్ చేసినప్పుడే పైరసీ ఆగుతుంది. కానీ పోలీసులు ఆ పని చెయ్యకుండా.. రవినే పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇతన్ని ఎంత ప్రశ్నించినా పోలీసులకు ఉపయోగం పెద్దగా ఉండదు. అసలు పైరసీ కింగులను కనిపెట్టాలి. వాళ్లను అరెస్టు చేసినప్పుడే దీనికి బ్రేక్ పడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ కోరాల్సింది ఇదే. రవి దొరకగానే.. టాలీవుడ్ ప్రముఖులు చాలా ఆనందపడ్డారు.
ఎందుకంటే.. అతనే అంతా చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ.. అతను ఓ పరాన్నజీవి లాంటి వాడని ఆ తర్వాత తేలింది. అందుకే పైరసీ ఆగట్లేదు. మరి పోలీసులు అసలైన కింగ్‌పిన్‌లను పట్టుకుంటారా? నిజంగా పైరసీకి బ్రేక్ వేస్తారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.
