దేశంలోని విమానాశ్రయాల్లో బాడీ స్కానర్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్, సిబ్బంది చేతిలో పట్టుకునే స్కానర్‌ల స్థానంలో బాడీ స్కానర్‌లను తీసుకురావాలని దిశానిర్దేశం చేసింది. అయితే 2010 ప్రారంభంలో అమెరికా ఎయిర్‌పోర్ట్స్‌లో రెండున్నర లక్షల డాలర్ల ఖర్చుతో 174 రాపిస్కాన్ స్కానర్లను (Rapiscan X-ray body scanners) ఇన్‌స్టాల్ చేశారు. ఈ బ్యాక్‌స్కాటర్ ఎక్స్-రే మెషీన్స్‌ని బ్రిటన్ లాంటి దేశాల్లో కూడా వాడారు.
ఆ టైమ్‌లో వీటికి ‘వర్చువల్ స్ట్రిప్ సెర్చెస్’ అనే పేరు వచ్చింది. దీనికి కారణం ఈ స్కానర్ల నుంచి లీకైన కొన్ని ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే. అవి పూర్తి నగ్న శరీరాలను, పర్సనల్ అనాటమీని కూడా క్లియర్‌గా చూపించాయి. చెక్‌పాయింట్‌లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు (TSOs) స్క్రీన్‌పై ప్రయాణికుల నగ్న చిత్రాలను చూసేవారు. ఆఫీసర్ చెక్‌పాయింట్‌కి దూరంగా ఉన్న రూమ్‌లో కూర్చున్నా, బట్టల కింద ఉన్న ప్రతీదీ వారికి కనిపించేది.

ఆ తర్వాత స్క్రీనింగ్ ఆఫీసర్ రేడియోలో బయట ఉన్న ఆఫీసర్‌కి బాడీలో ఎక్కడ చెక్ చేయాలో చెప్పేవారు. దీనివల్ల ప్రైవసీ హద్దులు దాటింది అనే కామెంట్లు రావడమే కాక, రేడియేషన్ ఎక్స్‌పోజర్ గురించి కూడా ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే 2013లో ఈ బ్యాక్‌స్కాటర్ ఎక్స్-రే మెషీన్స్‌ను తొలగించారు. వివాదాస్పదమైన పాత మెషీన్లను తీసేశాక ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్‌లో అడ్వాన్స్‌డ్ ఇమేజింగ్ టెక్నాలజీ (AIT)తో కూడిన మిల్లీమీటర్ వేవ్ స్కానర్స్ వాడుతున్నారు. ప్రస్తుతానికి ప్రతి మేజర్ ఎయిర్‌పోర్ట్‌లో ఇవే స్టాండర్డ్ కిట్‌గా ఉన్నాయి.
TSA ప్రతినిధి ఆర్.కార్టర్ లాంగ్‌స్టన్ ప్రకారం.. ఈ మిల్లీమీటర్-వేవ్ స్కానర్ కేవలం కొన్ని సెకన్లలో మెటాలిక్, నాన్-మెటాలిక్ థ్రెట్స్ అంటే బ్యాగ్స్, బాంబులు లాంటివి డిటెక్ట్ చేస్తుంది. ఇవి ప్యాసింజర్ బాడీ రియల్ ఇమేజ్‌ను చూపించవు. ‘నాన్-డిస్క్రిప్ట్ అవతార్’ను మాత్రమే చూపిస్తాయి. దీన్ని ‘పేపర్ డాల్’ లేదా ‘జింజర్ బ్రెడ్ మ్యాన్’ అవుట్‌లైన్ అని కూడా అంటారు. ఈ అవతార్ ద్వారా ప్రయాణికుల ప్రైవసీని కాపాడుతూనే సెక్యూరిటీ మెయింటైన్ అవుతుంది. స్కానర్ మీపై ఎలాంటి అనుమానాస్పద వస్తువునూ డిటెక్ట్ చేయకపోతే ఆఫీసర్‌కు మీ అవుట్‌లైన్ అస్సలు కనిపించదు.

వారికి కేవలం స్క్రీన్‌పై ‘OK’ అనే మెసేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ, ఏదైనా వస్తువు ఉందనే అనుమానం ఉంటే ఆ అవతార్‌పై ఆ వస్తువు ఉన్న ప్రాంతంలో ఒక బాక్స్ రెడ్ కలర్ సిగ్నల్‌తో కనిపిస్తుంది. ఉదాహరణకు, పాకెట్‌లో ఏదైనా ఉంటే, అవతార్ ఆ ప్రాంతంలో అలారం నోట్ వస్తుంది. ఆఫీసర్ అప్పుడు ఆ బాక్స్‌లో ఉన్న ప్రాంతాన్ని చెక్ చేస్తారు. ప్రయాణికులు కూడా స్కానింగ్ ప్రాసెస్ అంతా వ్యూయింగ్ మానిటర్‌పై చూసేందుకు అవకాశం ఉంటుంది. అంటే, ఆఫీసర్లు ఏం చూస్తున్నారో మీరు కూడా చూడవచ్చు.
