దువ్వాడ మాధురి. ఫుల్ నెగిటివిటీతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి.. అంతే నెగిటివిటీతో బయటకు వచ్చేసింది. కానీ.. ప్రస్తుతం హౌస్లో ఉన్న వాళ్ల మాదిరిగా.. ఎలాంటి మాస్క్ లేకుండా.. తాను ఎలా ఉండాలనుకుందో అలాగే ఉంది. అయితే మాటలు మరీ శ్రుతిమించడంతో ఆమెపై నెగెటివిటీ వచ్చింది. నాగార్జున కూడా మాధురిని హెచ్చరించాల్సి వచ్చింది. దీంతో మనసు మార్చుకున్న ఆమె తన ఆట, మాట తీరు మార్చుకుంది. కానీ అప్పటికే లేట్ అయిపోయింద. తక్కువ ఓట్లు పడడంతో మూడు వారాల్లోనే బయటకు వచ్చేసింది.
బిగ్ బాస్ హౌస్ లో మాధురి ప్రవర్తనను పక్కన పెడితే.. బయటకు వచ్చాక ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. బిగ్ బాస్ వాళ్లు పారితోషికం ఎంత ఇస్తారో తెలియదు.. కానీ, వచ్చింది ఎంతైనా సేవ కార్యక్రమాలకే ఖర్చు పెడతామని మాధురి చెప్పిన మాటలు ఆమెపై గౌరవాన్ని పెంచాయి. ఇప్పుడు ఈ మాటను నిలబెట్టుకుంటోంది మాధురి. తన బిగ్ బాస్ రెమ్యునరేషన్ మొత్తాన్ని పేదలకు పంచుతోంది. మూడు రోజుల క్రితమే సేవా కార్యక్రమాలను ప్రారంభించింది మాధురి.
దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి అత్యవసరం ఉన్న పేదలను గుర్తించి వారికి తన రెమ్యునరేషన్ ను సాయంగా అందజేస్తోంది. ఇప్పటికే బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఇంటికెళ్లి మరీ రూ. 80 వేలుఆర్థిక సహాయాన్ని అందించారు మాధురి, దువ్వాడ. తాజాగా పేగు క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళకు వీరు అండగా నిలిచారు. నరసన్నపేట నియోజకవర్గం అల్లాడ గ్రామం లో హెచ్ కుమారి అనే ఓ మహిళ ప్రేగు క్యాన్సర్ తో పోరాడుతోంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్, మాధురి క్యాన్సర్ బాధితురాలి ఇంటికి వెళ్లారు.
ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఆమెకు తాజాగా రూ. లక్షా పదివేలు సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాధురి, శ్రీనివాస్ లపై ఎంత నెగెటివిటీ ఉన్నా సాయం విషయంలో మాత్రం వీరిని మెచ్చుకోవచ్చంటున్నారు నెటిజన్లు. వారి ఉదారతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
