ఏ మనిషికైనా కోపం రావడం సహజం. ఇక భార్యాభర్తలంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరి మీద మరొకరికి చిన్న విషయాలకైనా కోపం వస్తుంది. అయితే, ఆ కోపం ఎక్కువ సేపు ఉండదు. ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది. అయితే మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్‌తో అఖిలకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి రెండేళ్ల కుమారుడు శ్రియాన్ గౌడ్ ఉన్నాడు.
ప్రవీణ్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే అనారోగ్య సమస్యలతో ఏడాది క్రితం ప్రవీణ్ మరణించాడు. అప్పటి నుంచి అఖిలకు జీవితం పూర్తిగా మారిపోయింది. భర్త లేని లోటు ఆమెను రోజురోజుకూ మానసికంగా కుంగదీస్తూ వచ్చింది. భర్త మరణం తర్వాత అఖిల తన కుమారుడితో కలిసి అత్తారింట్లోనే నివాసం ఉంటోంది. ప్రవీణ్ జ్ఞాపకాల నుంచి బయటపడలేక తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుండేది.

బయటకు పెద్దగా చెప్పుకోకపోయినా.. లోలోపల మాత్రం తీవ్రమైన ఒంటరితనం, వేదన ఆమెను కమ్మేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ రోజు అత్త జమున ఇంటికి రాగా లోపల తలుపులు మూసి ఉండటాన్ని గమనించింది. ఎంతసేపటికి తలుపులు తట్టినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అఖిల అప్పటికే మృతి చెందగా, శ్రియాన్ కొద్దిగా కదులుతున్నట్లు అనిపించడంతో వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అక్కడ వైద్యులు శ్రియాన్ కూడా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. తల్లి–బిడ్డ ఒకే సమయంలో ప్రాణాలు విడిచిన ఈ సంఘటనతో ఖాజాపూర్ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. భర్తని మర్చిపోలేక కన్నవాడినే తీసుకుపోయింది అంటూ గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ దారుణ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
