గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న వీరిరువురు ఈ ఉదయం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరు లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇషా పౌండేషన్ యోగా సెంటర్ లో సమంత, రాజ్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే సమంత ఎరుపు రంగు చీరలో, బంగారు ఆభరణాలతో అలంకరించుకొని కనిపిస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు కామెంట్ చేశారు. లింగ భైరవి సన్నిధిలో సన్నిహితుల సమక్షంలో ఈ జంట భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లుగా ఈశా సెంటర్ ప్రకటించింది. ‘దేవి అనుగ్రహం వారిద్దరికీ ఉండాలి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ఈశా యోగా సెంటర్ తెలిపింది.
భక్తితో పాటు అందులో కొన్ని ప్రత్యేక పద్ధతులపై విశ్వాసం ఉన్నవారు ఎంచుకునే వివాహ ప్రక్రియగా దీనిని భావించవచ్చు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ పద్ధతి ప్రాచుర్యంలో ఉందని హైదరాబాద్‌లోని కొత్తపేటకు చెందిన పురోహితుడు శర్మ చెప్పారు. ఈశా సద్గురు ఫౌండేషన్ వెబ్‌సైట్ ప్రకారం, భూత శుద్ధి వివాహం అనేది పెళ్లికి సంబంధించిన ఒక ప్రాచీన యోగిక్ ప్రాసెస్.
లింగ భైరవి అంటే పార్వతి దేవి రూపమని పురోహితుడు శర్మ చెప్పారు. హిందూ మత విశ్వాసాలలో, ఆధ్మాత్మిక సాహిత్యంలో పంచభూతాలుగా పేర్కొనే ‘భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశాన్ని ప్రసన్నం చేసుకునే ప్రక్రియే భూతశుద్ధి’ అని ఈశా వెబ్‌సైట్ పేర్కొంది.
