ఎంత కష్టమైనా, లక్షల రూపాయలు వెచ్చించి సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. ఇటీవలి కాలంలో హోమ్ లోన్ తీసుకుని తమ కలను నెరవేర్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ రోజుల్లో సొంత ఇల్లు ఉండాలని సాధారణ, మధ్య తరగతి ప్రజలు కలలు కంటూ ఉటారు.
తమకు ఉన్న సంపాదనలో కొద్ది భాగం ఇల్లు కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇపుడున్న పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలకు భారంగానే మారింది. పట్టణాల్లో అయితే పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మారింది.

అయితే ఖమ్మం లో ఓ ఇల్లు ఓనర్ వినూత్న ఆఫర్‌తో ముందుకు వచ్చాడు. ఖమ్మం జయ నగర్ కాలనిలో 130 గజాల్లో రూ.25 లక్షలు విలువగల ఇల్లు అమ్మేందుకు లక్కీ డ్రా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. రూ.250 చెల్లించి లక్కీ డ్రా లో పాల్గొనాలనీ ఆఫర్ పెట్టారు. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున డ్రా తీస్తామని ప్రకటించారు.
ఈ ఆఫర్ ను నమ్మి కొందరు డబ్బులు చెల్లించి డ్రా కూపన్ తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఖమ్మం అర్బన్ పీఎస్ లో నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
