గాయని రావు బాలసరస్వతి కన్నుమూశారు. హైదరాబాద్ మణికొండ గాయత్రీ ప్లాజాలోని తన నివాసంలో బుధవారం ఉదయం రావు బాల సరస్వతి(97) కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలియజేశారు. 1928లో జన్మించిన బాల సరస్వతి తన ఆరేళ్ల వయసు నుంచే పాడడం ప్రారంభించారు. అయితే సింగర్ బాల సరస్వతీదేవి చిన్నతనం నుంచే సంగీతం మీద ప్రత్యేక అభిమానం కలిగేవారు. ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మెదలు పెట్టారు.

ఆరేళ్ల వయసులోనే హెచ్ఎంవీ కంపెనీ ఆమె పాటను గ్రామ ఫోన్లో రికార్డు చేసింది. తన అద్భుతమైన గాత్రంతో అందర్నీ ఆకట్టుకున్న బాల సరస్వతీదేవి ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమయ్యారు. అనంతరం ‘సతీ అనసూయ’ చిత్రంలో తొలి పాటను ఆలపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి దశలో అనేక అద్భుతమైన పాటలు పాడారు. ఆమె పాడిన పాటలు అనేక మంది హృదయాలను తాకాయి.1930 నుంచి 1960 వరకు తెలుగు, తమిళ సినిమాల్లో పాటలు పాడటంతో పాటు పలు చిత్రాల్లో బాల సరస్వతిదేవి నటించి మెప్పించారు.

‘సతీ అనసూయ’ సినిమా ద్వారా తన తొలి నేపథ్య గానాన్ని పాడారు బాల సరస్వతీదేవి. అనంతరం ఆమె పలు భాషల్లో పాటలు ఆలపించారు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ వంటి ఇతర భాషల్లోనూ పాటలు పాడారు. ఇలా తన గాన జీవితంలో 2000కి పైగా పాటలు పాడిన బాలసరస్వతి ఎన్నో తరాల సంగీత ప్రియులకు గుర్తుండిపోయే స్వరాలను అందించారు. భర్త కోలంక జమీందర్ శ్రీ రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బతికి ఉన్నంతకాలం మైసూర్లో జీవించిన బాల సరస్వతీదేవి ఆయన మరణం అనంతరం తన కుమారుడితో కలిసి హైదరాబాద్ వచ్చేశారు.
మణికొండలోని గాయత్రీ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. అయితే ఇంట్లో ప్రమాదవశాత్తు ఆమె జారిపడిపోవడంతో తుంటి ఎముక విరిగిపోయింది. ఆ తర్వాత అది సరి అయ్యింది. చివరకు 90 ఏళ్ల వయసులో కూడా ఆమె పాటలుపాడారు. ఈమెకు రామినేని ఫౌండేషన్ అవార్డు, వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు.
