బస్సు రాత్రి 10 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున 2:14కి తెలంగాణ సరిహద్దులోని పులూరు టోల్ ప్లాజా చేరింది. 3:30 ప్రాంతంలో కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ప్రమాదం జరిగింది. బస్సు బైక్ను ఢీ కొట్టి దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. ఆ క్రమంలోనే మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది.
అయితే బస్సులో ఉన్న వందలాది మొబైల్ ఫోన్ల పార్సిల్ ఈ ప్రమాద తీవ్రతను పెంచినట్లు గుర్తించారు. అయితే ఈ దుర్ఘటనలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన హరీశ్కుమార్రాజు సమయస్ఫూర్తితో స్పందించి పది మంది ప్రాణాలు కాపాడారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడు హైదరాబాద్ వెళ్లి తిరిగి గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో బెంగళూరుకు బయలుదేరారు.

ఆ సమయంలోనే బస్సు ప్రమాదాన్ని గమనించి రాయితో కుడివైపు అద్దాన్ని పగులగొట్టారు. ఆ విధంగా బస్సు లోపల ఉన్న పదిమంది ప్రయాణికులు బయటకు రాగలిగారని తెలిపారు. అలానే బస్సు నుంచి బయటపడిన వారిలో ఆరుగురికి గాయాలు కావడంతో హరీశ్ తన స్నేహితుల సహకారంతో అటుగా వస్తున్న ఓ కారు యజమానిని ఆపారు.
సదరు కారు డ్రైవరు నవీన్ నంద్యాలకు వెళుతూ ప్రమాదాన్ని గమనించి కారును ఆపినట్టు తెలుస్తోంది. ప్రయాణికులను రక్షించేందుకు తనవంతు కృషిగా.. బయటపడిన వారిలో తీవ్ర అస్వస్థతకు ఆరుగురిని తన వాహనంలో ఎక్కించుకుని హుటాహుటిన కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడారు.
