వీ కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు పటాన్ చెరువులోని ప్రధాన ఆఫీసు నుంచి గురువారం రాత్రి 9గంటలకు బయలుదేరింది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు బయలుదేరింది. శుక్రవారం వేకువ జాము 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలోకి రాగానే.. ఎదురుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైకు పూర్తిగా బస్సు కిందకు దూరిపోయింది. అయితే ప్రమాదం జరిగిన బస్సులో ముందుగా సీటు రిజర్వ్ చేసుకున్న వ్యక్తి కాకుండా హైదరాబాద్‌లోని ఆరాంఘర్ వద్ద ఓ అపరిచిత వ్యక్తి ఎక్కారని అధికారులు గుర్తించారు. ప్రమాదంలో మరణించిన ఈ వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ అపరిచిత వ్యక్తి గురించి సమాచారం ఉంటే 08518- 277305 నంబరుకు సంప్రదించాలని జిల్లా పోలీసు కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో కోరారు.

ఫోరెన్సిక్ విశ్లేషణ, విజువల్ రీకన్‌స్ట్రక్షన్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్ల ఆధారంగా బస్సు అగ్ని ప్రమాదానికి దారితీసిన పరిణామాలను పోలీసులు నిర్ధారించారు. బస్సు డ్రైవర్ లక్ష్మయ్య నిర్లక్ష్యంగా బస్సును నడుపుతూ, ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ డ్రైవర్ శివశంకర్ అక్కడికక్కడే మరణించారు. బస్సు కింద ఇరుక్కుపోయిన బైకును బస్సును అలాగే లాక్కెళ్లడంతో మంటలు అంటుకున్నాయి.
బస్సు బ్యాటరీలు, ఫర్నీచర్ వల్ల మంటలు పెద్దఎత్తున చెలరేగి బస్సు పూర్తిగా కాలిపోయేలా చేశాయి. ఈ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. శనివారం ఉదయం నుంచే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు నిర్వహించారు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను ఆపి క్షున్నంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్సుల్లోని ఎన్నో లోపాలు బయటపడ్డాయి.
ఎమర్జెన్సీ డోర్‌కు అడ్డంగా బెడ్లు, డమ్మీ ఫైర్ సిలిండర్లు, దూర ప్రయాణాలకు సైతం సింగిల్ డ్రైవర్ ఉండడం వంటివి అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పలు బస్సులను సీజ్ చేశారు.
