కదులకుండా కూర్చని ప్రయాణం చేసినా కొందరికీ కాళ్ల వాపులు కనిపిస్తాయి. పెయిన్ ఎక్కువ లేకపోవడం వల్ల.. ఈ సమస్యను ఎవరూ ఎక్కువగా పట్టించుకోరు. ఇలా కాళ్లు వాపు ఉంటే.. కిడ్నీ సమస్యలు ఉన్నాయని చాలామంది భావిస్తారు. అయితే ముఖ్యంగా రక్త ప్రసరణ సరిగా లేకపోవడం అనేది ప్రాణాంతక సమస్యలకు దారి తీయవచ్చు. రక్త ప్రసరణ లోపం యొక్క ముఖ్యమైన సంకేతాలు మన పాదాలలో కనిపిస్తాయి.
మీ పాదాలలో మీరు అనుభవించే మూడు ప్రధాన లక్షణాలు, పాదాలలో వాపు, బరువు.. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో లేదా ఎక్కువసేపు నిలబడిన తర్వాత మీ పాదాలు, చీలమండలలో వాపు వస్తే, అది రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి సంకేతం. వైద్య పరిభాషలో దీనిని ఎడెమా అంటారు. రక్త ప్రసరణ మందగించడం వల్ల రక్తం, ఇతర ద్రవాలు పాదాలలో పేరుకుపోయి.. అవి బరువుగా, వాపుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు గట్టి బూట్లు ధరించడం కూడా రక్త ప్రసరణను అడ్డుకుంటుంది.

కాళ్ల నొప్పి, తిమ్మిరి..మీరు రోజూ నడుస్తున్నప్పుడు లేదా రాత్రి నిద్రలో మీ కాళ్ళలో తరచుగా నొప్పి, తిమ్మిరి లేదా జలదరింపు వస్తుంటే ఇది రక్త ప్రసరణ లోపమే కావచ్చు. రక్త నాళాలలో రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల, కండరాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనివల్ల నొప్పి, తిమ్మిరి వస్తాయి. మీరు నడుస్తున్నప్పుడు కాళ్ళలో నొప్పి వచ్చి, ఆగిన వెంటనే నొప్పి తగ్గితే, దానిని క్లాడికేషన్ అంటారు. ఇది రక్త ప్రసరణ సరిగా లేకపోవడానికి అత్యంత సాధారణ లక్షణం.
పాదాల రంగు.. మీ పాదాలు, ముఖ్యంగా కాలి వేళ్లు చల్లగా అనిపించడం లేదా పాదాల రంగు నీలం, ఊదా లేదా ఎరుపు రంగులోకి మారడం వంటివి రక్త ప్రసరణ లోపానికి సంకేతాలు. రక్త ప్రసరణ సరిగా లేకపోతే పాదాలకు తగినంత వేడి అందదు, అందుకే చల్లగా ఉంటాయి. గాయం మానకపోవడం.. పాదంలో గాయం అయినప్పుడు అది మానడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అప్రమత్తంగా ఉండాలి. గాయం నయం కావడానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు అందకపోవడమే దీనికి కారణం.
మీరు ఈ లక్షణాలలో దేనినైనా నిరంతరం అనుభవిస్తే, వాటిని విస్మరించకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం అనేది గుండె జబ్బులు, స్ట్రోక్ లేదా కణజాలం చనిపోయే గ్యాంగ్రీన్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా తీవ్ర పరిణామాల నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
