భూమి.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఫాలోవర్ల కోసం బ్యూటీ, ఫిట్నెస్ సీక్రెట్స్ షేర్ చేస్తుంది భూమి. అయితే బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న భూమి పడ్నేకర్ తనకున్న చర్మ వ్యాధి గురించి బయటపెట్టింది. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో దీని గురించి వెల్లడించింది. భూమి ఎగ్జిమా (తామర) అనే చర్మ వ్యాధితో బాధపడుతోంది.తనకు చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉందట.
కానీ ఇది మూడేళ్ల క్రితమే నిర్ధారణ అయింది. తాను ఎక్కువగా ప్రయాణించినప్పుడల్లా, పోషకాహారం తీసుకోకపోయినా లేదా అధిక ఒత్తిడిని అనుభవించినా చర్మంపై దద్దుర్లు రావడం విపరీతంగా దురదలు వస్తాయని భూమి పేర్కొంది. దీని కారణంగా తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ సమస్య గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని, తద్వారా ప్రజలు దీనిని సకాలంలో అర్థం చేసుకుని చికిత్స పొందుతారని భూమి తెలిపింది.
ఎగ్జిమాను అటోపిక్ డెర్మటైటిస్ అని కూడా పిలుస్తారు. దీని కారణంగా చర్మంపై దురద, పొడిబారడం, మంట, ఎర్రటి మచ్చలు వంటివి వస్తాయి. ఇది అంటువ్యాధి కాదు, అంటే ఇది స్పర్శ ద్వారా వ్యాపించదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీర రోగనిరోధక వ్యవస్థ అలెర్జీ కారకానికి అతిగా స్పందించినప్పుడు ఈ సమస్య వస్తుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం ఎగ్జిమా లేదా తామర అనేక కారణాల వల్ల సంభవించవచ్చు.
పెర్ఫ్యూమ్లు లేదా రసాయన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం, దుమ్ము , వాతావరణంలో ఆకస్మిక మార్పులు, ఎక్కువ వేడి, అలాగే చెడు ఆహారపు అలవాట్లు, అధికి ఒత్తిడి మరియు నిద్ర లేకపోవడం ఇలా ఎగ్జిమా రావడానికి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో భూమి పెడ్నేకర్ కూడా విపరీత ప్రయాణాలు, అనారోగ్యకరమైన ఆహారం, తీవ్రమైన ఒత్తిడుల కారణంగానే ఎగ్జిమా బారిన పడ్డానంటోంది.
