‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి, తాజాగా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంలో యువరాణి పాత్రలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తన నటన, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులతో అందరినీ ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రుక్మిణీ వసంత్ ఒక హీరోయిన్‌గా మాత్రమే అందరికీ తెలుసు.

కానీ, ఆమె దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ జవాన్ కూతురు అని చాలా మందికి తెలియదు. రుక్మినీ వసంత్ తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. పఠాన్‌కోట్, సిక్కిం, రాంచీ, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఆయన భారత ఆర్మీకి సేవలు అందించారు. అయితే రుక్మిణీకి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన వీరమరణం పొందారు.
2007లో 8 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో జమ్మూ కశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలోకి ప్రవేశించారు. వారిని గమనించిన కల్నల్ వసంత్ టీమ్ ఉగ్రవాదులతో పోరాడింది. ముఖ్యంగా రుక్మిణీ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రమూకలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన శరీరంలోకి సుమారు 7కు పైగా బుల్లెట్లు దిగాయి. కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

ఆయన ధైర్యసాహాసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అశోక చక్ర పతకంతో కల్నల్ వసంత్ వేణుగోపాల్ ను గౌరవించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ పతకం అందుకున్న మొదటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. కాగా తన తండ్రి పేరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా రుక్మిణి కూడా తన పేరును రుక్మిణి వసంత్‌గా మార్చుకుంది.
వసంత్ వేణుగోపాల్ మరణం తర్వాత.., ఆయన భార్య సుభాషిణి వసంత్ “వీర్ రత్న ఫౌండేషన్” అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో యుద్ధ వీరుల భార్యలు, కుటుంబాలను అన్నివిధాలుగా అదుకుంటున్నారు. సుమారు 120కి పైగా కుటుంబాలకు చెందిన పిల్లల చదువు కోసం ఆమె పాటు పడుతున్నారు.