IVF అంటే ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్. ఇది ఒక సంతాన సాఫల్య చికిత్స (సహాయక పునరుత్పత్తి సాంకేతికత), ఇందులో స్త్రీ అండాశయం నుండి గుడ్లను సేకరించి, ప్రయోగశాలలో పురుషుడి స్పెర్మ్‌తో వాటిని కృత్రిమంగా ఫలదీకరణం చేస్తారు. ఈ ఫలదీకరణం చెందిన గుడ్డును పిండం అంటారు. అయితే ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ మెడికల్ టెక్నాలజీతో, మహిళలు మగవాళ్లతో శారీరకంగా కలవడకుండానే తల్లి కావచ్చు.
తెలుగు సినిమా ‘మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి’లో ఇదే కాన్సెప్ట్ చూపించారు. సరిగ్గా ఇలాంటి ట్రెండ్ ఫాలో అవుతూ పెళ్లి కాకుండా, భర్త అవసరం లేకుండానే తల్లి అయింది పాపులర్ భోజ్‌పురి సింగర్ దేవి. 2025, సెప్టెంబర్ 9న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. రిషికేశ్‌లోని ఎయిమ్స్ హాస్పిటల్‌లో సి-సెక్షన్ ద్వారా డెలివరీ జరిగింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. జర్మనీ స్పెర్మ్ బ్యాంక్ నుంచి తెప్పించిన దాత వీర్యం తో IVF టెక్నాలజీ ద్వారా సింగర్ దేవి ప్రెగ్నెంట్ అయింది.
ఈ బోల్డ్ డెసిషన్‌పై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. దేవి చిన్నారి ఫస్ట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “మేరా బాబు హై” (నా బాబు) అని ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. తల్లి కావాలన్న దేవి ప్రయాణం చాలా ఏళ్ల కిందటే మొదలైంది. ఏడేళ్ల క్రితమే మొదటిసారి IVF (In Vitro Fertilization) కోసం ప్రయత్నించినా, ఆ ప్రయత్నం ఫెయిల్ అయింది.
కానీ ఈసారి సక్సెస్ అయింది. చాలామందికి IVF అంటే అపోహలు ఉంటాయి. ఈ పద్ధతిలో స్త్రీ అండాలను ల్యాబ్‌లో ఫలదీకరణ చేసి, పిండాన్ని తిరిగి గర్భాశయంలోకి పంపిస్తారు. ఇది కేవలం పిల్లలు పుట్టని దంపతులకే అనుకుంటారు. కానీ మన దేశ చట్టాల ప్రకారం, పెళ్లికాని, విడాకులు తీసుకున్న లేదా భర్తను కోల్పోయిన మహిళలు, కొన్ని కండిషన్స్ ప్రకారం సింగిల్ ఉమెన్ కూడా తల్లి కావొచ్చు.