ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లిదండ్రులు లేని పిల్లలకు అండగా నిలుస్తోంది. అందులో భాగంగానే మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో సహాయం అందించారు. మొదటి విడతలో 24,000 రూపాయలు, రెండో విడతలో అదనంగా 6,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. అర్హులైన పిల్లలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
కాగా ఈ డబ్బుల్లో కేంద్రం 60 శాతం.. రాష్ట్రం 40 శాతం ఇస్తుంది. అయితే అర్హులైన పిల్లలు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచించారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, సీడీపీవో కార్యాలయాల్లో సంప్రదించి.. అవసరమైన పత్రాలు అందించాలని అధికారులు సూచించారు. ఈ మేరకు దరఖాస్తు చేసేందుకు పిల్లల జనన, ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాలు అందజేయాల్సి ఉంటుంది.

అలాగే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, రేషన్‌కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ బుక్, మిగిలిన పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అయితే ఈ డాక్యుమెంట్‌లపై కచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలి. అర్హుల ఎంపికలో ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదువుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. మిషన్ వాత్సల్య కింద ఎంపికైన వారికి నెలకు రూ. 4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఫైనల్ జాబితా ప్రకటించనున్నారు. ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయినవారు మాత్రమే అర్హులు. 2025 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు వయసు ఉండాలి. వీరితో పాటుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు కూడా అర్హులు. అలాగే బాలల న్యాయ చట్టం- 2015 ప్రకారం నిరాదరణకు గురైన పిల్లలు కూడా అర్హులే.
కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72వేలు ఉండాలి. అదే పట్టణాల్లో అయితే రూ. 96వేలు మించకూడదు. ఈ పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందజేస్తున్నాయి. కేంద్ర వాటా 60 శాతం, రాష్ట్రం 40శాతం డబ్బును అందజేయనుంది.