కృష్ణం రాజు నట వారసుడిగా టాలీవుడ్లో చక్రం తిప్పుతున్నారు ప్రభాస్. సినిమాల పరంగా టాప్ హీరోగా వెలుగొందుతున్న ఆయన.. 45 ఏళ్ళొచ్చినా ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. దీంతో గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లిపై జోరుగా చర్చలు నడుస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు.
కాకినాడ జిల్లాలో తలుపులమ్మ లోవ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా జాతర జరుగుతోంది. ఈ జాతర సందర్భంగా ఆలయానికి ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి విచ్చేశారు. జాతర సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తలుపులమ్మ అమ్మవారికి ఆమె కుంకుమార్చన చేశారు. ప్రభాస్ పెద్దమ్మ రావడంతో ఆలయ అధికారులు, అక్కడి ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ఆమెకు దర్శనం కల్పించారు.

ఆలయ డిప్యూటీ కమిషనర్ విశ్వనాథరాజు ఆలయ విశిష్టిత.. అమ్మవారి మహిమ వివరించారు. శ్యామల దేవి విచ్చేశారనే విషయం తెలుసుకుని ప్రభాస్ అభిమానులు ఆమెను చూసేందుకు తరలివచ్చారు. భక్తులతోపాటు ప్రభాస్ అభిమానులు ఆమెతో పలకరించేందుకు ప్రయత్నం చేశారు. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అనూహ్యంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఆలయంలో ప్రత్యక్షం కావడం కొంత చర్చనీయాంశంగా మారింది.
ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని చర్చ జరుగుతున్న సమయంలో ఆమె ఆలయంలో పూజలు చేయడం ఆసక్తికరంగా మారింది. తన కుమారుడు ప్రభాస్ వివాహం కోసం శ్యామలా దేవి ఆలయంలో పూజలు చేశారని కొందరు చెబుతున్నారు. వయసు పైబడుతుండడంతో చక్కటి అమ్మాయి ప్రభాస్‌కు భార్యగా రావాలని పెద్దమ్మ శ్యామల దేవి ప్రార్థించి ఉంటారని ప్రభాస్ అభిమనులు భావిస్తున్నారు.