బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. అందుకే వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అయితే తులం బంగారంపై ఏకంగా రూ. 25,000 తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే లక్ష రూపాయల మార్కును దాటిన బంగారం ధరలు భవిష్యత్తులోనూ భారీగా పెరుగుతాయని చాలామంది భావిస్తున్నారు.
కానీ, బులియన్ మార్కెట్ నిపుణులు కూడా ఇప్పుడే తొందరపడొద్దని సూచిస్తున్నారు. సిటీ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం, 2025 మూడవ త్రైమాసికానికల్లా బంగారం ధరలు గణనీయంగా తగ్గుతాయి. 2026 నాటికి కనీసం 25 శాతం తగ్గుదల ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3400 డాలర్లు ఉండగా, 2026 నాటికి అది 2400-2500 డాలర్లకు పడిపోవచ్చని సిటీ బ్యాంక్ చెబుతోంది. బంగారం ధరలు తగ్గడానికి పలు కారణాలున్నాయి.
ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి డిమాండ్ తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి మెరుగుపడే అవకాశం, ట్రంప్ ప్రభుత్వ టారిఫ్ ప్లాన్స్ సర్దుబాటు వంటి అంశాలు దీనికి దోహదపడతాయి. అంతేకాకుండా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను తగ్గించడం కూడా ధరలు దిగిరావడానికి కారణమవుతాయి.
గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరలు 45 శాతం పెరిగాయి. 2025 ప్రారంభం నుంచి జూలై వరకు 30 శాతం పెరిగి, ఏప్రిల్లో గరిష్ట స్థాయికి చేరాయి. సిటీ బ్యాంక్ అంచనాలు నిజమైతే, రాబోయే 6 నెలల్లో బంగారం ధరలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి, బంగారం కొనుగోలు ప్రణాళికలున్న మహిళలు కాస్త ఓపిక పడితే మంచి లాభం పొందవచ్చు.