ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండటంతో, మార్కెట్లపై ప్రభావం కొనసాగుతోంది. దీనివల్ల మదుపుదారులు బంగారంపై ఆసక్తి చూపుతున్నారు. గడిచిన 10 రోజుల బంగారం ధరలు చూస్తే 10 గ్రాములపైన దాదాపు రూ.1,000ల వరకు తగ్గాయి. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం లేకపోలేదు.
బంగారం కొనే వారికి ఇవి మంచిరోజులే అనుకోవచ్చు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలో హెచ్చుతగ్గుల ప్రభావం దేశీయ మార్కెట్లో కనిపిస్తోంది. జూన్ 24న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92, 290 రూపాయల వద్ద ఉంది.

కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో ఇప్పటివరకు బంగారం ధర పెద్దగా పెరగలేదు. ఇరాన్ ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా వైమానిక దాడి చేసినప్పటికీ, సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.27% తగ్గింది. భారతదేశంలోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం మధ్యాహ్నం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.
ప్రారంభ వాణిజ్యంలో ఇది కేవలం 0.06% స్వల్ప క్షీణతతో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రూపాయి బలహీనత భారతదేశంలో బంగారం ధరలకు మద్దతు ఇస్తోంది. ఈ ధరలు రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటుంది. జీఎస్టీ, ఇతర ఛార్జీలు కలిపి ధరలు మరింత పెరుగుతాయని గుర్తించుకోండి.