గూడూరు రోడ్డులో ఉన్న ఓ చికెన్ సెంటర్ వద్ద వెన్కాబ్ కంపెనీ డీలర్ జహంగీర్ ఆదివారం మాంసం ప్రియులకు కంపెనీ ఆధ్వర్యంలో ఉచితంగా చికెన్ పకోడీ, ఉడకబెట్టిన గుడ్లను పంపిణీ చేశారు. కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో వ్యాపారాలు జరగక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చికెన్ పకోడీ, గుడ్లను ఉచితంగా పంపిణీ చేయడం గమనార్హం. అయితే తాజాగా రాష్ట్రంలోని తొలి బర్డ్ ఫ్లూ కేసు కూడా యాదాద్రి జిల్లా నేలపట్ల గ్రామంలో నమోదయింది.
దీంతో చికెన్, ఎగ్ అంటేనే జనం హాడలిపోతున్నారు. దీంతో పాల్ట్రీ పరిశ్రమ వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం పడింది. చికెన్ విక్రయాలు గణనీయంగా తగ్గడంతో పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఈ ప్రభావం కోడి గుడ్ల విక్రయాలపైనా పడింది. చికెన్, కోడిగుడ్లను బాగా ఉడికిస్తే బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని.. అధికారులు చేసిన ప్రచారాన్ని జనం పట్టించుకోవడం లేదు. ప్రజల్లో చికెన్, గుడ్లు తినడం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు వ్యాపారులు నానా పాట్లు పడుతున్నారు. పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు, చికెన్ వ్యాపారులు జనాల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని పోగొట్టేందుకు వినూత్నంగా ఆలోచనలు చేశారు.
ప్రజల్లో నెలకొన్న బర్డ్ ఫ్లూ భయాన్ని పారదోలే లక్ష్యంతో ‘చికెన్ ఎలాంటి భయము లేదు.. వ్యాధులు రావు… శుభ్రంగా ఎప్పటిలాగే చికెన్ వంటకాలనుతినవచ్చు’నంటూ పౌల్ట్రీ ఫాం నిర్వాహకులు, చికెన్ వ్యాపారులు ఉచిత ఎగ్, చికెన్ మేళాలను నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పాల్ట్రీ యజమానులు ఉచితంగా చికెన్ పకోడీలు, బాయిల్డ్ ఎగ్స్ ను పంపిణీ చేశారు. ఇందుకోసం ముందస్తు ప్రచారం నిర్వహించారు. చికెన్ పకోడీ కోసం చిన్న పెద్ద తేడా లేకుండా ఎగబడ్డారు. వీటి కోసం గంటలు తరబడి క్యూ లైన్ లో నిలుచున్నారు. ఒక్కో మేళాలో 500 కిలోల వేయించిన కోడి పకోడీ, మూడు వేల ఉడకబెట్టిన కోడిగుడ్లను ఈ మేళాలో ఉచితంగా పంపిణీ చేశారు.
దీంతో బర్డ్ ఫ్లూపై భయం నెలకొన్న ప్రచారాన్ని తలదన్నుతూ ఉచిత ఎగ్, చికెన్ పకోడీల కోసం జనం ఎగబడ్డారు. అంచనాకు మించి చికెన్ ప్రియులు చికెన్ పకోడీ కోసం ఎగబడటంతో పోలీసుల సాయంతో పౌల్ట్రీ ఫాం సిబ్బంది అరగంటలో పంపిణీని పూర్తి చేసింది. కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల మనుషులకు ఎలాంటి హాని జరగదని, బర్డ్ ఫ్లూ పక్షులకు మాత్రమే వస్తుందని, మనుషులకు ఈ వ్యాధి రాదని మేళాలో పాల్గొన్నవారికి పౌల్ట్రీ వ్యాపారులు వివరించారు. మార్చి 2 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బర్డ్ ఫ్లూ పై మాంసం ప్రియులకు అవగాహన కల్పించేందుకే ఈ మేళాలను నిర్వహించామని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.