శోభితతో పెళ్లి తర్వాత నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి నాగ చైతన్య కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. కోడలు శోభిత అడుగుపెట్టిన సమయం కలిసి వచ్చిందని నాగార్జున పొగిడారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నాగచైతన్య- శోభిత ధూళిపాల్ల జంట కూడా ఒకటి.

గతేడాది వీరి వివాహం జరిగింది. తాజాగా ఈ దంపతులు తమ గొప్ప మనసును చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులిచ్చారు. హైదరాబాద్ లోని సెయింట్ జ్యూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్. క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే పిల్లలకు, వాని కుటుంబాలకు ఉచిత ఆశ్రయం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే నాగ చైతన్య- శోభిత దంపతులు ఈ కేర్ సెంటర్ ను సందర్శించారు. అక్కడి పిల్లలతో కలిసి సరదాగా గడిపారు.

ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య పిల్లలతో బాగా కలిసిపోయాడు. వారితో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా వేశాడు. అడిగిన వారందరికీ సెల్ఫీలు, ఫొటోలు ఇచ్చాడు. ఇక శోభిత కూడా పిల్లలతో కబుర్లు చెబుతూ వారి కళ్లల్లో ఆనందాన్ని నింపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇది చూసిన వారందరూ నాగ చైతన్య- శోభితలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.