ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని రోజులు చికెన్ తినకపోవడం ఉత్తమమని తెలిపింది. దీంతో చికెన్ ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే అధికారులు కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టారు. కానీ, కొన్ని చోట్లా బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో చనిపోయిన కోళ్లను మేతగా వేస్తున్న వీడియోలను కాకినాడకు చెందిన ఎన్జీవో సభ్యులు విడుదల చేశారు. అయితే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా.. కోళ్లకు, వాటి ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్‌ఫ్లూ వైరస్.. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫామ్‌లో బైటపడింది.
అప్పటినుంచి ఏటా మన దేశంలో బర్డ్‌ఫ్లూ అలారమ్ మోగుతూనే ఉంది. మహారాష్ట్ర, కేరళ, బెంగాల్, ఒడిషా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 25 సీజన్లలో విరుచుకుపడింది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇంతవరకూ బర్డ్‌ఫ్లూ ఫియర్‌తో 90 లక్షల కోళ్లు వధకు గురయ్యాయి. వాటితో పాటు పౌల్ట్రీ రంగానికి వేల కోట్లలో నష్టాలు కూడా. లేటెస్ట్గా మళ్లీ దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో మోత మోగిస్తోంది బర్డ్‌ఫ్లూ మహమ్మారి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్నికుదిపేస్తోంది బర్డ్ ఫ్లూ వైరస్.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లోని కోళ్లఫారాల్లో మరణ మృదంగం.. చూస్తుండగానే లక్షలాది కోళ్లు కుప్పకూలిపోతున్నాయి.
కానూరు, వేల్పూరులో ఏకంగా ఐదు లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. 15 రోజులుగా వణికిస్తున్న అంతుబట్టని వైరస్‌పై కొంత క్లారిటీ ఐతే ఉంది. ఐనా.. కోళ్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని భోపాల్‌లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పంపితే… ఇది మరేదో కాదని.. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా-H5N1 అని తేల్చేశారు. ల్యాబ్ రిపోర్ట్ రాగానే రాజమండ్రిలో అత్యవసర సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పౌల్ట్రీ ఫామ్ చుట్టుపక్కన కిలోమీటరు దూరం వరకు రెడ్‌జోన్‌గా.. పది కిలోమీటర్లు సర్విలెన్స్ జోన్‌గా ప్రకటించారు. మనుషుల సంచారాన్ని కూడా నియంత్రించారు. బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలిన కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టాలని, కోడిగుడ్లనూ నిర్మూలించాలని ఆదేశాలొచ్చేశాయ్. పూడ్చిపెట్టే ఒక్కో కోడికి 90 రూపాయల చొప్పున పరిహారం కూడా అందిస్తోంది ప్రభుత్వం.
లక్షలు పెట్టి దాణా వేసి, పెంచుకున్న కోళ్లు కళ్లముందే నిమిషాల్లో చచ్చిపోతుంటే లబోదిబోమంటున్నారు పౌల్ట్రీ యజమానులు.. కొల్లేరు సరస్సుకు వలస పక్షులు ఎక్కువగా రావడం వల్ల వాటి ద్వారా కోళ్లకు వైరస్ వ్యాపించి ఉంటుందా? చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయని పౌల్ట్రీ యజమానుల అలసత్వమే కారణమా..? అని ఆరా తీస్తున్నారు. కానీ.. ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంటేనే బర్డ్‌ఫ్లూ వైరస్ బతికుంటుంది. ప్రస్తుతం సగటున 34 డిగ్రీల పైనే టెంపరేచర్ నమోదౌతోంది కనుక.. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నియంత్రణలో ఉంటుంది అనేది ఒక భరోసా. కానీ.. ఉమ్మడి గోదావరి జిల్లాలనుంచి పక్కనే ఉన్న ఎన్జీఆర్జిల్లాకూ పాకింది బర్డ్ ఫ్లూ. చనిపోయిన కోళ్లను గొయ్యి తవ్వి ఎక్కడికక్కడే పాతిపెట్టేస్తున్న దృశ్యాలైతే హృదయ విదారకం.
కొన్నేళ్ల కిందట ఒకసారి బర్డ్‌ఫ్లూ వైరస్ కనిపించింది. కానీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఈసారి మాత్రం పౌల్ట్రీ పరిశ్రమను నాశనం చేసేదాకా వదిలేలా లేదు. చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చిపెట్టాలి.. లేదా జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలన్నది అధికారుల ఆదేశం. కానీ.. పంటకాలవల్లో పడేస్తూ జనారోగ్యంతో చెలగాటమాడితే..! పశుసంవర్థక శాఖ ఎంత అప్రమత్తమైనా.. ఎన్ని చర్యలు తీసుకున్నా అధికారుల కళ్లు గప్పి కోళ్లను మాయం చేస్తున్నారు పౌల్ట్రీ ఓనర్లు. పశ్చిమగోదావరి జిల్లాలో కొన్నిచోట్ల బర్డ్ ఫ్లూ వైరస్‌ను గుర్తించిన పౌల్ట్రీల్లోంచి గుట్టుచప్పుడు కాకుండా కోళ్లను తరలిస్తున్నారు. కనిపిస్తే కోళ్లను చంపేస్తారనే భయంతో రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు సర్దేస్తున్నారు. దీంతో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి సులభంగానే జరిగిపోతోంది.
అటు.. ముందే మేలుకున్న పొరుగురాష్ట్రం తెలంగాణ సరిహద్దుల్లో 24 ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ఎపీ నుంచి రవాణా ఔతున్న కోళ్లను తిప్పి పంపుతున్నారు తెలంగాణ రవాణా శాఖ అధికారులు. చెక్ పోస్టుల్లో మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ పూర్తి నిఘా పెట్టారు. బర్డ్ ఫ్లూ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేవరకు ఇలా నిషేధాజ్ఞలు కొనసాగుతాయ్. సో.. కోళ్ల వ్యాన్లకు తెలంగాణలో నో ఎంట్రీ అన్నమాట. ఆ రేంజ్లో ఉంది తెలుగురాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ టెర్రర్.గత ఏప్రిల్‌లో అమెరికానూ వణికించింది బర్డ్‌ఫ్లూ. కోళ్ల నుంచి 70 మంది మనుషులకు సోకింది. కానీ.. మనిషి నుంచి మనిషికి బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తుందా.. ప్రజారోగ్యం నిజంగానే ప్రమాదంలో పడుతుందా అనే స్పష్టతైతే లేదు.. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఐనా.. బర్డ్‌ఫ్లూ అనగానే ఎందుకంత టెర్రర్.. పౌల్ట్రీ ప్రాడక్ట్స్ తింటే మనకూ బర్డ్‌ఫ్లూ సోకుతుందా.. ?