భార్యాభర్తలు పెళ్లయిన తర్వాత కొన్ని రోజులు సంతోషంగా ఉన్నా కాలం గడుస్తున్న కొద్ది ఒకరి మీద ఒకరికి చిన్న చిన్న గొడవలు రావడం, కోపాలు తెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల దూరం పెరుగుతూ వస్తుంది. అలాగే ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరిగితే మాత్రం ఆ అనుమానాలు తీరడం అనేవి చాలా కష్టమైపోతాయి. అయితే గుంటూరుకు చెందిన గొట్టిపాటి రామక్రిష్ణ ఒక ఛానెల్లో రిపోర్టర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. 2005లో విజయతో ఆయనకు వివాహమైంది. వీరికి ఇద్దరూ పిల్లలు కలిగిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తింది. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయిన జాండిస్ ను సరైన సమయంలో గుర్తించలేకపోవడంతో లివరర్ సిరోసిస్ కు దారి తీసింది.
గుంటూరులోని పలువురు వైద్యుల వద్దకు వెళ్లిన వ్యాధి ముదిరిపోయిందని లివర్ మార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిందేని తేల్చి చెప్పేశారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లు కావడంతో ఆర్థికంగా భారమైన ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి తలెత్తింది. ఒక వైపు ఆర్థిక భారం మరొక వైపు లివర్ ఇచ్చే దాతలు ఎవరన్న కోణంలో సమస్య తీవ్ర రూపం దాల్చింది. 2019లో వ్యాధిని గుర్తించిన తర్వాత ఆపరేషన్ చేయించుకునేందుకు రామక్రిష్ణ సిద్దమయ్యారు. అయితే ఆరోగ్య శ్రీలో శస్త్ర చికిత్స చేసే వెసులుబాటు అప్పటికి లేదు. సిఎం రిలిఫ్ ఫండ్ ను ఆశ్రయిద్దామంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పాటు లివర్ ఇచ్చే వారికి ప్రయత్నాలు ప్రారంభించారు.

రామక్రిష్ణ తల్లిదండ్రులిద్దరూ వయస్సు రిత్యా పెద్దవారు కావడంతో వారికి లివర్ ఇచ్చే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో రామక్రిష్ణ భార్య విజయ ముందుకొచ్చింది.. ఇద్దరూ ఆడపిల్లలున్నా తన భర్తను బ్రతికించుకునేందుకు ఆమె పెద్ద సాహసమే చేసింది. లివర్ ఇచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విజయకు వైద్యులు సూచించినా ఆమె వెనక్కి తగ్గలేదు. తన కుటుంబ పెద్ద దిక్కును దక్కించుకునేందుకు ఆమె ఇక వెనక్కి తిరిగి చూడలేదు. లివర్ ఇచ్చేందుకు సిద్దమైన విజయ హైదరాబాద్ పయనమైంది. గ్లోబల్ ఆసుపత్రిలో రామక్రిష్ణకు శస్త్రచికిత్స చేసేందుకు వైద్యులు సిద్దమయ్యారు. 2019 మే ముప్పైన విజయవంతంగా డాక్టర్లు శస్త్రచికిత్స పూర్తి చేశారు.
యాభై శాతం విజయ లివర్ ను తీసి రామక్రిష్ణకు ఆపరేషన్ ద్వారా అమర్చారు. అయితే ఆపరేషన్ కు అవరమైన డబ్బులో కొంత అప్పటి ప్రభుత్వం ఇవ్వగా మరికొంత మొత్తాన్ని తమకున్న చిన్నచిన్న ఆస్తులను అమ్ముకొని పోగు చేసుకున్నారు. మరొకవైపు విజయ సోదరుడు రమేష్ కూడా తనకు చేతనైనంత సాయం చేశాడు. 2019లో ఆపరేషన్ పూర్తయిన తర్వాత క్రమంగా రామక్రిష్ణ, విజయ కోలుకున్నారు. ఇద్దరూ ఏ పని చేయలేకపోయిన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రామక్రిష్ణ మరొక చిన్న ఛానల్ లో పనిచేస్తున్నారు. ఆడపిల్లలిద్దరూ చదువుకుంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆ కుటుంబంలో ఆనందానికి లోటు లేదు. భర్తకు చేదోడుగా భార్య… భార్యకు ఆధారంగా భర్త కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పడిద్దరు తమ ఇద్దరి ఆడపిల్లలకు పెళ్లి చేయాలన్న సంకల్పంతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఎందరికో వీరిద్దరూ స్పూర్తి… కష్టకాలంలో ఒకరికి మరొకరు తోడుగా నిలిచి ఎందరికో ఆదర్శప్రాయంగా ఈ జంట నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు.