ఇంట్లోకి దొంగ రావడంతో కొంతమంది సేవకులు నిద్ర నుంచి మేల్కొన్నారు. ఇంట్లో శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కోన్న సైఫ్ బయటకు వచ్చి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఆ దొంగ సైఫ్ పై కాత్తితో దాడి చేసి అతడిని తీవ్రంగా గాయపరిచాడు. కాగా, ఘటన అనంతరం దొంగ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ తీవ్రంగా గాలిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య, నటి కరీనా కపూర్ ఖాన్, వారి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
అయితే “సైఫ్‌ను దొంగ కత్తితో దాడి చేశాడా.. ? లేదా అతడితో ఏమైనా గొడవ జరిగిన సమయంలో సైఫ్ గాయపడ్డాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మేము ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నాము. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది’’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సైఫ్ పర్సనల్ టీమ్ స్పందిస్తూ.. ప్రస్తుతం సైఫ్ కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుందని.. ఈ ఘటనపై మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నామని.. ఇది పోలీసుల విషయం, మేము పరిస్థితిని మీకు తెలియజేస్తాము అని పేర్కోన్నారు.
అర్ధరాత్రి 3.30 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ని లీలావతి ఆసుపత్రికి తీసుకొచ్చారు . అతని శరీరంపై మొత్తం ఆరు గాయాలు ఉండగా వాటిలో రెండు లోతుగా ఉన్నాయి. అతని వెన్నెముక దగ్గర బలంగా గాయమైంది. ప్రస్తుతం ఆయనకు న్యూరోసర్జన్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్, అనస్థటిస్ట్ నిషా గాంధీ చికిత్స అందిస్తున్నారు. సైఫ్‌కు సర్జరీ చేసిన తర్వాతే మరింత సమాచారం అందించగలుగుతాం “అని లీలావతి హాస్పిటల్ సీఈవో నీరజ్ వివరించారు.
సైఫ్ అలీఖాన్ భవనంలోని సీసీటీవీలను, చుట్టుపక్కల భవనాల్లోని సీసీటీవీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఉద్దేశంతో దాడి చేశాడనే దానిపై పోలీసులకు ఇంకా సమాచారం అందలేదు. సైఫ్‌కి చికిత్స చేసిన తర్వాత అతడి నుంచి వాంగ్మూలం తీసుకోనున్నారు. ఈ ఘటనలో సైఫ్ భార్య కరీనా కపూర్, పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.