చిన్న వయసులో పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఓ మాటలో చెప్పాలంటే వారి మనస్సు స్పాంజ్ లాంటిది. స్పాంజ్‌లాగా ఆ మనుస్సు కూడా ప్రతి విషయాన్ని తనలో తాను గ్రహిస్తుంది. అంటే.. చిన్నతనంలో జరిగే విషయాలు వారి మనానసిక ఎదుగుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అయితే పెద్దవాళ్ల ప్రవర్తన వారిపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే ముందు తల్లిదండ్రులు సరిగా ఉంటే, వారి పిల్లలు మంచివారిగా ఎదుగుతారు. దీనికి సంబంధించిన విషయాలను ఆచార్య చాణక్యుడు నీతి సూత్రాల్లో వివరించాడు. చాణక్య నీతి ప్రకారం, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కొన్ని పనులను ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు.
అబద్ధాలు చెప్పడం..పిల్లల ముందు అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం ఎంతమాత్రం మంచిది కాదు. తల్లిదండ్రులు నిజాయితీగా ఉంటేనే పిల్లలు కూడా నిజాయితీపరులుగా ఎదుగుతారు. చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్తే, పిల్లలు తల్లిదండ్రులను నమ్మడం మానేస్తారు. అంతేకాదు, వారు కూడా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం నేర్చుకుంటారు. నిజాయితీ అనేది పిల్లలకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతుల్లో ఒకటి. ఇది వారి వ్యక్తిత్వాన్ని గొప్పగా మార్చేస్తుంది. అగౌరవంగా ప్రవర్తించడం..తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇంట్లో గొడవలు, విభేదాలు సహజం. కానీ చిన్నారుల ముందు తిట్టుకోవడం, అవమానకరమైన పదాలు ఉపయోగించడం సరికాదు.
ఇలాంటి వాతావరణం పిల్లల మనసుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంట్లో ప్రేమ, గౌరవం ఉంటేనే వారు సంతోషంగా ఉంటారు. వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇతరులతో పోల్చకూడదు..ప్రతి ఒక్కరికీ స్పెషల్ టాలెంట్ ఉంటుంది. తల్లిదండ్రులు వాటిని గుర్తించాలి. కానీ, కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఇతరులతో పోలుస్తూ అవమానిస్తారు, “వాడిని చూడు ఎంత బాగా చదువుతున్నాడో” లేదా “నీ స్నేహితురాలు ఎంత చక్కగా ఆడుతుందో” ఇలా పోల్చడం వల్ల పిల్లలు తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు, ఆత్మవిశ్వాసం కోల్పోతారు. వారిని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడటం, వారి ప్రయత్నాలను తక్కువగా చూడటం కూడా వారి ఎదుగుదలను అడ్డుకుంటుంది.
పిల్లల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, వారికి స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడటం తప్పనిసరి. ఇతరులను అవమానించకూడదు.. పిల్లల ముందు ఇతరులను ఎప్పుడూ అవమానించకూడదు. అది మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు లేదా మరే ఇతర వ్యక్తులైనా కావచ్చు. తల్లిదండ్రులు ఇతరులను కించపరచడం లేదా హేళన చేయడం చూస్తే, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అంతేకాదు, దీనివల్ల పిల్లల్లో ఇతరులపై గౌరవం తగ్గిపోతుంది. వారిలో ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరినీ గౌరవించడం, మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి.
అతిగా కోప్పడకూడదు.. పిల్లల ముందు అతిగా కోప్పడటం లేదా హింసాత్మకంగా ప్రవర్తించడం కూడా మంచిది కాదు. ఇది వారిలో భయాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. పిల్లలు చిన్నప్పుడు పచ్చి మట్టి ముద్దల్లాంటివారు. వారిని ఎలా మలుచుకుంటే అలా తయారవుతారు. మొక్క ఆరోగ్యంగా ఎదగాలంటే దానికి సరైన నీరు, వెలుతురు ఎంత అవసరమో, పిల్లలు కూడా మంచిగా ఎదగడానికి సరైన వాతావరణం అంతే అవసరం. తల్లిదండ్రుల మాటలు, చేతలు పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది లాంటివి. డబ్బు సమస్యలు పిల్లల ముందు చెప్పొద్దు.. అంతేకాకుండా, పిల్లల ముందు డబ్బు గురించిన గొడవలు లేదా ఆస్తుల గురించి వాదనలు చేయడం కూడా మంచిది కాదు. ఇది పిల్లలకు తప్పుడు సంకేతాలను పంపుతుంది.