మమితా బైజు.. అసలు తెలుగులో నేరుగా ఒక్క సినిమా చేయకపోయినా తెలుగు అడియన్స్ మనసు దొచుకుంది. అందం.. అంతకుమించిన చలాకీతనం.. తనదైన నటనతో కుర్రకారు ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఇటీవల మలయాళం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా.. ఇటీవల తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బాల దర్శకత్వంలో తెరకెక్కిన వనంగాన్ సినిమా పొంగల్ కి విడుదల కానుంది. అయితే అదే సమయంలో అజిత్ విడాముయార్చి విడుదలవుతుండటంతో వనంగాన్ వెనక్కి తగ్గుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో బాల ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివాదాలపై స్పందించారు. ముఖ్యంగా మమిత బైజును షూటింగ్ సెట్ లో కొట్టారన్న వార్తలపై ఆయన ఇచ్చిన వివరణ వైరల్ అవుతోంది. వర్మ సినిమా తర్వాత బాల దర్శకత్వంలో సూర్య నటించాల్సిన సినిమా వనంగాన్. 2022లో ఈ సినిమా ప్రకటన వచ్చింది. సూర్య 2D ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. పూజతో షూటింగ్ ప్రారంభమైంది. కానీ సూర్య, బాల మధ్య విభేదాల కారణంగా సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అనంతరం సూర్య అధికారికంగా సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
బాల కూడా సూర్య ఆ పాత్రకు సరిపోరని, త్వరలో వేరే హీరోతో సినిమాను పూర్తి చేస్తామని చెప్పారు. వనంగాన్ సినిమా ఆగిపోయిన వెంటనే హీరోయిన్ కీర్తి సురేష్, సూర్య చెల్లెలు పాత్రలో నటించిన మమిత బైజు సినిమా నుంచి తప్పుకున్నారు. కొత్త నటి కావడం, తెలుగు అంతగా రాకపోవడంతో మమిత బైజుపై బాల ఒత్తిడి తెచ్చారని, షూటింగ్ లో ఆమెను కొట్టారని వార్తలు వచ్చాయి. ఇంటర్వ్యూలో మమిత బైజు.. బాల తనను కొట్టబోయారని చెప్పారు. తర్వాత ఆమె వివరణ ఇస్తూ.. తాను చెప్పింది తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను చెప్పిన మాటల్లో కొంత భాగమే బయటకు వచ్చిందని, బాల తనను కొట్టలేదని, ఆయన తనను కూతురిలా చూసుకున్నారని చెప్పారు.
బాల కూడా ఈ వివాదంపై స్పందించారు. “మేకప్ వేసుకున్నావని కొట్టబోయా.. అంతలోనే నేను కొట్టానని వార్తలు వచ్చేశాయి. మమిత నా కూతురు లాంటిది. ఆమెను నేను కొడతానా? అది చాలా చిన్న పిల్ల. అమ్మాయిని ఎవరైనా కొడతారా? ముంబై నుంచి వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ నాకు మేకప్ ఇష్టం ఉండదని తెలియక మేకప్ వేసింది. షాట్ కి రెడీ అన్నప్పుడు మమిత మేకప్ వేసుకుని వచ్చింది. ఎవరు మేకప్ వేశారని అడిగేటప్పుడు కొట్టబోయినట్టు చేయి ఊపాను. అంతే.. నేను కొట్టేశానని వార్తలు వచ్చేశాయి” అని బాల చెప్పారు.