డిసెంబర్ 31వ తేదీన మద్యం కొనుగోళ్ల జోరు అధికంగా సాగడం షరా మాములే. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే నూతన మధ్య విధానం ద్వారా బ్రాండెడ్ మద్యం ను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం, ఇచ్చిన హామీ మేరకు 99 రూపాయలకే మద్యం బాటిళ్లను సైతం అందిస్తోంది. అయితే ఇక డిసెంబర్ 31న మద్యం ప్రియులకు పండగే.. పండగ. మందు పార్టీ చేసుకునేందుకు ముందుగానే ప్రిపెర్ అవుతుంటారు. కొందరైతే 31 కోసం ముందస్తుగానే మద్యాన్ని కొనుగోలు చేస్తుంటారు.
మద్యం షాపులకు ఫుల్లు గిరాకీ. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న వైన్స్ షాపులు సమయ వేళలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే బార్లు, రెస్టారెంట్లు కూడా తెల్లవారుజామున 1:00 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఈ మార్పులను ధృవీకరిస్తూ ఎక్సైజ్ శాఖ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం వివిధ ప్రత్యేక కార్యక్రమాలు, కార్యక్రమాలను గ్రీన్‌లైట్ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కొన్ని షరతులకు లోబడి తన అధికార పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతులు మంజూరు చేసింది. పార్టీలు, పబ్‌లలో డ్రగ్స్ వాడకుండా చూడాలని ఈవెంట్ నిర్వాహకులను ఆదేశించారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని నిరోధించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, వైన్ షాపులను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడానికి అనుమతించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.