బలగం చిత్రంలో ‘తోడుగా మాతోడుండి నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడికెళ్లినావు కొమురయ్యా’ పాటతో రెండు తెలుగు రాష్ట్రాలోను పాపులర్ అయ్యారు. మొగిలయ్యకు ఈ పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా బారిన పడటం, ఇతర అనారోగ్య కారణాలతో మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. అయితే కొన్ని రోజులుగా కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్ధండి, చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ లో భావోద్వేగభరితమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమాతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
కొన్నాళ్లుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితోపాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది. హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు. ఆతర్వాత బలగం సినిమా డైరెక్టర్ వేణుతోపాటు, మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సాయం చేశారు. కానీ మళ్లీ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు అసుపత్రికి తరలించారు.
మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం ప్రకటించారు.