ఆధ్యాత్మికంగా దివ్యమైన కార్తీక మాసంలో చేసే స్నానానికి విశిష్టమైన స్థానం ఉంది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో శివ కేశవులను పుజిస్తారు. ఇది దామోదర మాసం కనుక ‘కార్తిక దామోదర’ అనే నామంతో స్మరణ చేస్తారు.సూర్యోదయానికి ముందే బ్రహ్మ మూహుర్తంలో అభ్యంగన స్నానమాచరిస్తారు. ఈ నెలలో వెలిగించే దీపం శుభకరం అని నమ్మకం.
అయితే కార్తీక మాసం మొదటి రోజు శైవ క్షేత్రంలో వింత చోటు చేసుకుంది. స్వామివారి గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడంతో అక్కడి భక్తుల్లో ఎనలేని ఆధ్యాత్మికత ఉప్పొంగింది. ఇది శివుడి మహాత్యమా లేక నిర్మాణ నైపుణ్యమా అంటూ ఉప్పొంగిపోతున్నారు శివ భక్తులు. కార్తీక మాసం మొదటి రోజు జరిగిన ఈ సంబరం ఆశ్చర్యాన్ని చూసేందుకు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు.
నంద్యాల జిల్లా సిరివెళ్లలోని శ్రీ ఓంకారేశ్వర ఆలయం ను 700 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్ర మహారాజు కాలంలో శివలింగం ప్రతిష్టించారని ప్రతీతి. ఈ ఆలయంలోని గర్భగుడి శివలింగాన్ని కార్తీక మాసం మొదటి రోజు సూర్యకిరణాలు తాకాయి. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తండోపతండాలుగా దర్శనార్థం భక్తులు తరలివచ్చారు.
ఇది వింతనా లేక నిర్మాణంలోనే నైపుణ్యమా అంటూ భక్తుల్లో చర్చ మొదలైంది. నిర్మాణ నైపుణ్యం అయితే ప్రతిరోజు జరగాలి. అలా కాకుండా చాలా ఏళ్ల తర్వాత అది కూడా కార్తీకమాసం మొదటి రోజే జరగడం పట్ల నిజంగా దైవ మహత్యం గా స్థానిక భక్తులు భావిస్తున్నారు.