హైదరాబాద్ బేగంపేటలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుపోయారు. బాలయ్య చికెన్ సెంటర్‌లో పెద్ద మొత్తంతో కుళ్లిపోయిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. 700 కిలోల కుళ్లిన చికెన్ సీజ్ చేశారు. కుళ్లిన చికెన్‌కు కెమికల్స్ కలిపి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ చికెన్‌ను హోటళ్లు, జనతా బార్లు, కర్రీ పాయింట్లకు విక్రయిస్తున్నారట. బాలయ్య చికెన్ సెంటర్ సీజ్ చేసిన అధికారులు, యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కుళ్లిపోయిన చికెన్ దందా హైదరాబాద్ లోనే జరుగుతోంది. బేగంపేట్ పోలీస్ స్టేషన పరిధి ప్రకాశ్ నగర్ లో ఈ నిర్వాకం జరుగుతోంది. బాలయ్య చికెన్ సెంటర్ అనే పేరిట ఈ కుళ్లిన చికెన్ దందా చేస్తున్నారు.
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఈ కుళ్లిన చికెన్ దందా గురించి పక్కా సమాచారం అందింది. వాళ్లు మున్సిపల్ హెల్త్ అధికారులతో కలిసి ఈ దాడులు నిర్వహించారు. రూపాయికి కక్కుర్తి పడి నగరవాసుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వీళ్ల పండారం బయట పడింది. దాదాపు 15 రోజుల వరకు నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు చెప్పిన విషయాలకు అధికారులకు కూడా కళ్లు బైర్లు కమ్మాయి.
ఎందుకంటే ఈ కుళ్లిన చికెన్ ని కేజీ 30 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తారంట. వీటిని జనతా బార్లు, కళ్లు కాంపౌండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న చిన్న ఫుడ్ కోర్టులకు విక్రయిస్తారని దర్యాప్తులో తేలింది. వీళ్లు ఎలాంటి కోళ్లను కోయరు. వాటి మాంసాన్ని అమ్మరు. హైదరాబాద్ సహా.. ముంబయి, చెన్నై వంటి నగరాల నుంచి చికెన్ వేస్టేజ్ ని సేకరిస్తారు. ఆ తర్వాత దానిని బార్లు, కల్లు కాంపౌండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి విక్రయిస్తారు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి గతంలో కూడా పట్టుబడ్డాడు. గతంలో కంటోన్మెంట్, రసూల్ పురలో ఇలాగే కుళ్లిన చికెన్ విక్రయించాడు.
స్థానికుల ఫిర్యాదుతో అక్కడ దుకాణం మూసేశాడు. మళ్లీ ప్రకాశ్ నగర్ లో ఇలా దందా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నార్త్ జోన్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ కుళ్లిన చికెన్ దందాను మూసేశారు. ఇతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నగరవాసులు ఈ విషయం తెలుసుకుని బెంబేలెత్తిపోతున్నారు. బయట చికెన్ తినాలి అంటేనే.. భయంతో వణికిపోతున్నారు. కనీసం ఇప్పటికైనా అసలు విషయం తెలుసింది అంటూ ఊపిరిపీల్చుకుంటున్నారు. మరి.. ఈ కుళ్లిన చికెన్ దందాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.