దేశంలోని కోటి మంది పౌరులకు ఉచిత విద్యుత్‌ను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం పేరు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’. ఈ పథకంలో 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించనున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకం అందిస్తోంది. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో వెలుగులు నింపనుంది. అర్హులైన లబ్ధిదారులకు ఏపీఈపీడీసీఎల్ యూనిట్లు మంజూరు చేయనుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు. గ్రామాల్లో ప్రత్యేక సర్వే కూడా చేపట్టారు.
కాగా వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సదుపాయం ఉంది. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న ఇళ్లకు ఏ మేరకు సౌర ప్లాంటు అవసరం ఉందో తెలుసుకుంటున్నారు. అర్హత కలిగిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అందుకే ఇప్పటికే ఈపీడీసీఎల్ సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. సోలార్ ప్లాంటు ఏర్పాటుకు గల అవకాశాలు, వినియోగం, లబ్ధిదారుల ఆసక్తి, ముందుగా ఖర్చు, రాయితీ సౌకర్యాలు వంటి తదితర అంశాలు వివరిస్తున్నారు.
ఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ లక్ష్మణరావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికీ 300 యూనిట్ల వరకు ఒకే విధంగా రాయితీ ఉంటుందని, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇంకా విధి విధానాలు రాలేదని చెప్పారు. ప్రస్తుతం వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. సూర్యఘర్ పథకాన్ని ఎలా వర్తింపజేస్తారో ఖరారు కావాల్సి ఉందన్నారు. అక్టోబరు నాటికి సర్వే పూర్తి చేసి యూనిట్ల ఏర్పాటుకు సిద్ధమవుతామని వివరించారు. కాగా ఈ స్కీమ్ కింద 300 యూనిట్ల వరకు రాయితీ వర్తిస్తుంది. అన్ని వర్గాల వారికీ ఒక్కో కిలోవాట్‌కు రూ.30 వేల వరకు సబ్సిడీ ఇస్తారు. కిలోవాట్ ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఖర్చవుతుంది.
ఇందులో రూ.30 వేలు తిరిగి పొందవచ్చు. అదే 2 కిలోవాట్ ప్లాంటు అయితే రూ.లక్ష నుంచి రూ.1.45 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వీరికి రూ.60 వేల వరకు రాయితీ కింద పొందొచ్చు. ఇక 3 కిలోవాట్ అయితే రూ.1.80 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీరికి రూ.90 వేల సబ్సిడీ దక్కనుంది. కాగా ఈ సోలార్ ప్లాంట్లు 25 ఏళ్ల వరకు పని చేస్తాయి. విజయనగరంలో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు 50 వేల మందికి పైగా ఉన్నారు. వీరిలో 38 వేల మంది ఇళ్లకు వెళ్లి సర్వే చేశారు. ఇక పార్వతీపురంలో అయితే 73 వేలకు పైగా ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. 31 వేల ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు.