వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుంది. ఉత్తర బంగాళా ఖాతంలో కేంద్రికృతం కానుంది. ఈ క్రమంలో 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత వచ్చే 24గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఒడిశా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ రోజు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.
అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే బాపట్ల, గుంటూరు, పల్నాడు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలోని మిగిలిన జిల్లాలు, కర్నూలు, రాయలసీమలోని నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తాలోని కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీసే ఛాన్స్ ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని అధికారులు సూచించారు. మరోవైపు గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 137మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. కొయ్యలగూడెంలో 111మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 96మిమీ, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92మిమీ, నిడదవోలులో 91మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 18 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. 85 ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాధ్ హెచ్చరికలు జారీ చేశారు.