మహోగ్రం

  • ఉరకలేస్తున్న కృష్ణమ్మ
  • కొనసాగుతున్న వరద
  • ఐదు లక్షల క్యూసెక్కులకు పెరిగిన ఇన్‌ఫ్లో
  • అదేస్థాయిలో దిగువకు విడుదల
  • ప్రకాశం బ్యారేజ్‌ చుట్టూ హై అలర్ట్‌
విజయవాడ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజ్‌కి కృష్ణమ్మ పరవళ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో 5లక్షల క్యూసెక్కులకు చేరుకుంది.మంగళవారం రాత్రి బ్యారేజ్‌లోని 70 గేట్లను ఆరు అడుగుల ఎత్తు వరకు ఎత్తగా... బుధవారం ఉదయం మరో నాలుగు అడుగులకు పెంచారు. ప్రస్తుతం పది అడుగల మేర ఎత్తుకు గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. పులిచింతల నుంచి మంగళవారం విడుదలైన నీరు వేగంగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరుతోంది. కృష్ణమ్మ ఉధృతి గురువారం నుంచి తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని బ్యారేజ్‌ నిర్వహణ అధికారులు చెబుతున్నారు.
 
ప్రస్తుతం పులిచింతల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ఇక్కడి నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే కింది వదులుతున్నారు. ఈ ప్రభావం గురు, శుక్రవారాల్లో కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజ్‌ నుంచి అవుట్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు ఉండగా వాటిలో నుంచి 1760 క్యూసెక్కుల నీటిని ఆరు కాల్వలకు విడుదల చేస్తున్నారు. వరదల కారణంగా కాల్వలకు విడుదల చేస్తున్న నీటి కోటాను అధికారులు పెంచారు. రైవస్‌ కాల్వకు 4300, కేఈబీ (కృష్ణా ఈస్ట్‌ బ్రాంచ్‌ కెనాల్‌)కు 1900, ఏలూరు కాల్వకు 1300, బందరు కాల్వకు 2300, కేడబ్ల్యూ (కృష్ణా వెస్ట్‌ కెనాల్‌)కు 7500, గుంటూరు ఛానల్‌కు 260 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌కు ఉధృతంగా వస్తున్న వరద కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో హైఅలెర్ట్‌ ప్రకటించారు. ఘాట్ల చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లుచేసి, ఇనుప జల్లెడలను అమర్చారు. దుర్గగుడికి వస్తున్న భక్తులు ఘాట్ల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టి, నదిలో సాధారణ పరిస్థితి వచ్చే వరకు దుర్గాఘాట్‌లో భక్తుల స్నానాలను నిషేధించారు. వరద ఉధృతికి ఎగువ భాగాన లంగరేసిన పడవ బ్యారేజ్‌ గేట్ల వద్దకు కొట్టుకు వచ్చేసింది. బ్యారేజ్‌ వద్ద ప్రస్తుత నీటిమట్టం 13.4 అడుగులుగా నమోదైంది. దీని గరిష్ట సామర్థ్యం 12 అడుగులు.
 
భూగర్భ జలాలకు ఊరట
పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ వేసవిలో మరీ దారుణంగా భూగర్భ జలాల పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం వస్తున్న వరద కారణంగా దిగువ భాగానికి ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఇదంతా హంసలదీవి వద్ద కడలిలో కలుస్తోంది. బ్యారేజ్‌ నుంచి దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే ఈ నదీ ప్రాంతం జలకళతో కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రం ఇసుక తిన్నెలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ నీరు నిల్వ లేకపోవడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం వరద మరో రెండు రోజులపాటు కొనసాగడం, బ్యారేజ్‌కు దిగువన ఉన్న ప్రాంతమంతా పూర్తిగా నీటితో నిండివుండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి