జులైలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం ... Darsi Live News

జులైలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం ... Darsi Live News

దిల్లీ: జులైలో అంతర్జాతీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలలోనే అంతర్జాతీయ విమానాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ కచ్చితమైన తేదీని ఇప్పుడే ప్రకటించలేమన్నారు.  ఇందుకు వాటాదారులు, వినియోగదారులకు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ‘వచ్చే నెలలో అంతర్జాతీయ విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తాం. నడుపుతామనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇప్పుడే స్పష్టమైన తేదీని ప్రకటించలేం’ అని మంత్రి పేర్కొన్నారు.  దేశంలో దేశీయ విమానాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి జూన్‌ 15వ తేదీ వరకు 1,35,954 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు మంత్రి ఈరోజు ఉదయం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు 1,464 విమాన సర్వీసులను వినియోగించినట్లు తెలిపారు.  కరోనా వైరస్‌ కట్టడికి మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. కాగా లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాలను తిరిగి ప్రారంభించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి