కష్టాల వలసలో కన్నీటి బాట || DARSI LIVE NEWS

కష్టాల వలసలో కన్నీటి బాట || DARSI LIVE NEWS

 
 

కర్నూలు జిల్లాకు చెందిన సుమారు 2 వేల మంది వలస కూలీలకు లాక్‌డౌన్‌ కష్టాలు
గుంటూరు జిల్లా నుంచి వెళ్తుండగా జి.ఉమ్మడివరం చెక్‌పోస్ట్‌ వద్ద నిలిపివేసిన పోలీసులు
శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు అక్కడే పడిగాపులు
 ఎట్టకేలకు వెనక్కి పంపిన అధికారులు
త్రిపురాంతకం గ్రామీణం

కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాలో మిరప కోతలకు వెళ్లిన సుమారు 2 వేల మంది వలస కూలీలు లాక్‌డౌన్‌తో ఇక్కట్లు పడాల్సి వచ్చింది. మూడు నెలల కిందట కూలీలు అక్కడి మిరప తోటల్లోకి పనులకు వెళ్లారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం అక్కడ కోతలు ఆపేశారు. దాంతో వారు 92 వాహనాల్లో స్వగ్రామాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం జి.ఉమ్మడివరం వద్దనున్న చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని నిలిపేశారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు అక్కడే పడిగాపులు కాశారు. ఆకలితో అలమటించారు. వారి అవస్థలను చూసిన గ్రామస్థులు ఉదయం నుంచి వారికి తాగునీటిని సరఫరా చేశారు. కొద్దిపాటి నీరు సరిపోకపోవడంతో పోలీసులు, గ్రామస్థులు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ రామకృష్ణతో మాట్లాడి అయిదు ట్యాంకర్ల నీటిని తెప్పించి దప్పిక తీర్చారు. మార్కాపురం ఆర్డీవో శేషిరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.చంద్రలీల, డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తదితరులు పరిస్థితిని సమీక్షించి కూలీలను గుంటూరు జిల్లాకే తిప్పి పంపారు.

ప్రసవానికి ఇంటికి వెళ్లనీయండయ్యా...
‘అయ్యా నేను నిండు గర్భిణిని. రేపో మాపో కాన్పయ్యే  పరిస్థితి. డాక్టర్లు ఈ నెల 30కల్లా ఆసుపత్రిలో చేరమన్నారు. అనుమతించి నన్ను మా ఇంటికి వెళ్లనీయండయ్యా. పొట్టలో ఓ ప్రాణం.. సంకలో మరో బిడ్డ.. రాత్రి నుంచి నరకయాతన అనుభవిస్తున్నా’ అంటూ కర్నూలు  జిల్లా  ఆదోనికి చెందిన ఎల్లమ్మ పోలీసులను వేడుకోవడం అక్కడున్నవారిని కదిలించింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి