మిడతల దండుతో 6 రాష్ట్రాల్లో హై అలర్ట్‌ - Darsi Live News

మిడతల దండుతో 6 రాష్ట్రాల్లో హై అలర్ట్‌ - Darsi Live News

న్యూఢిల్లీ : సోమాలియా దేశం నుండి మిడతల దండు భారత-పాక్‌ సరిహద్దుల్లోని సంతానోత్పత్తి ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశమున్నందున 6 రాష్ట్రాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అప్రమత్తం చేసింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో పంటలు నష్టపోకుండా మిడతలను నివారించేందుకు మిడత సర్కిల్‌ కార్యాలయాల ద్వారా చర్యలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా నుండి వచ్చే మిడతల దండు మన దేశంలోని 6 రాష్ట్రాల్లో తీవ్ర మైన పంటనష్టం కలిగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయశాఖ పేర్కొంది. జైసల్మేర్‌, బార్మెర్‌, జోద్‌ పూర్‌, నాగౌర్‌, సికార్‌, జైపూర్‌, రాజస్ధాన్‌ లోని అల్వార్‌, మధ్యప్రదేశ్‌ లోని టికామ్‌గ ప్రాంతాల్లో మిడతలు ప్రవేశించాయి. దీంతో ఆరు రాష్ట్రాల్లో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. ఎడారి మిడతలు రోజుకు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని, చదరపు కిలోమీటర్ల మిడతల దండు ఒక రోజులో 35వేల పంటలను తింటాయని అంచనా వేశారు. దీంతో మిడతల దండును నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. మిడతల నివారణకు వీలుగా పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ నుండి హెలికాప్టర్లను అద్దెకు తీసుకుంది. దీంతోపాటు అధునాతన డ్రోన్ల సాయంతో మిడతల దండును నిరోధించాలని నిర్ణయించారు. మిడతలు నివారణకు మలాథియాన్‌ ను స్ప్రే చేయాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌తో మాజీ కీటకాలజిస్ట్‌ ప్రమోద్‌ వాజ్‌పేయి సూచించారు. జులై 3 వరకు రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌లలో 1,32,777 హెక్టార్లలో వాటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. మరో 1,13,003 హెక్టార్లలో రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాయని అన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి