శ్రీమదాంధ్ర భాగవతం - 71 Episode - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు - Darsi Live News

శ్రీమదాంధ్ర భాగవతం - 71 Episode - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు - Darsi Live News

శ్రీమదాంధ్ర భాగవతం - 71 పూజ్యా గురువూలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు

శుకమహర్షి చెప్పిన లీలలలను విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. శుకమహర్షిని ‘ప్రపంచములో ఇంతటి గొప్ప అదృష్టమును పొందిన యశోదా నందులవంటి భార్యాభర్తలు ఎవరయినా ఉన్నారా? నంద యశోదలది ఏమి అదృష్టము! వారిద్దరూ ఏమి పూజ చేశారు? ఏ పూజచేస్తే కృష్ణుడు వారికి కొడుకయి పుట్టాడు? ఈ విషయమును చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగాడు. శుకబ్రహ్మ ‘వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమిమీద అవతరించే ముందు దేవతలను తమ అంశలతో భూమిమీద ఆవిర్భవించమన్నాడు. బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడయిన వాడు ద్రోణుడు, ద్రోణుడి భార్య ధర బ్రహ్మగారు వీరిద్దరినీ పిలిచి ‘శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు. మీరిద్దరూ కూడా వెళ్ళి భూమిమీద అవతరించండి’ అన్నారు. వారు ‘మేము అవతరిస్తాము. గొల్లవానిగా, గొల్లవాని భార్యగా మేము జన్మిస్తాము. దయచేసి మాకొక వరమును ఇవ్వవలసినది. భూమిమీద అవతరించిన కృష్ణ పరమాత్మని మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరమునీయవలసినది’ అని కోరారు. దాని ప్రకారం వారు భూమిపై యశోదానందులుగా జన్మించి, కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు. ఉలూఖల బంధనము ఉలూఖల బంధనం ఒక అద్భుతమయిన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమయిన లీల ఇదే. చాలామంది ఈ లీలను చెప్పమని అడిగి, తమ ఇళ్ళల్లో చెప్పించుకుని విని పొంగిపోతూ ఉంటారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతున్నది. భగవానుడు జన్మించిన తరువాత నందవ్రజంలోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయారు. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమయిన వస్త్రములు ధరించి భగవన్నామము చెపుతూ చల్ల చిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ ఒకపక్క నోటివెంట భగవన్నామము పలుకుతున్నది. మనస్సులోకృష్ణయ్యను తలుచుకుంటోంది. ఆ సమయమునకు అక్కడికి బాలకృష్ణుడు వచ్చి అమ్మా! నాకు బాగా ఆకలి వేస్తోంది. నాకు తొందరగా పాలు ఇవ్వు’ అన్నాడు. ఆమె పిల్లవాడు ఏమి చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉన్నది. కృష్ణుడు ‘నువ్వు పాలు చిలకడం ఆపి నాకు పాలు ఇస్తావా? ఇవ్వవా? అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పెడుతుందేమోనని తల్లి అనుకుని చల్ల చేయడం ఆపేసింది. కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తున్నది. కృష్ణుడు పాలు త్రాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీటవేసి దానిమీద పిల్లవాడిని కూర్చోపెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీదవున్న పాలకుండను జాగ్రత్తగా దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. ఈవిధంగా పాలుత్రాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది. తల్లి తనను ఎందుకు దింపివేసిందని చూసాడు. కృష్ణుడికి కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక రాయితీసి కుండకి వేసి కొట్టాడు. కుండ పగిలిపోయి అందులోంచి వెన్నముద్దలు తేలి, పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లంవైపు ప్రవహిస్తోంది. క్రిందపడిన వెన్నను నోట్లో పెట్టుకుని, గబగబా మింగేస్తూ తనకి పాలివ్వలేదని మధ్యమధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యిమీద నుంచి దించే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప్పడుతుందని రెండుచేతులతో రెండు వెన్నముద్దలను పట్టుకుని గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి పక్కయింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో దంచడానికి పనికిరాని కొయ్యరోలు ఒకటి ఉంది. ఆ రోలును తిరగేసి దానిమీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలివేస్తోందని మధ్య మధ్యలో దొంగ ఏడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటికి ఆ ఇంట్లోని వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా ఆ వెన్నను తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. ఆవిడ పాలకుండను దింపి వెనక్కి తిరిగివచ్చి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడి కృష్ణుడు! కుండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటినన్నిటిని చూసింది. ‘గోపికలు చెప్పింది యథార్థమే. వీడు చాలా అల్లరి చేస్తున్నాడన్నమాట’ అని అనుకున్నది. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఒక రాతిని తిరగేసి దానిమీద కూర్చుని కోతులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణుని చూసింది. ఆవిడ వీడి అల్లరి ఎక్కువయి పోయింది. ఏదో ఒకటి చెయ్యాలి వీడిని ఇవాళ కొట్టేస్తాను’ అనుకుంది. గోపకాంతలు అందరూ యశోద ఏమి చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. యశోద ‘ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను’ అనగానే కోతులకు పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మీదనుంచి దూకేశాడు. కృష్ణుడిని పట్టుకుందామని ఆవిడ దగ్గరకు వెళ్ళింది. ఆ ఇల్లంతా స్తంభములు ఉన్నాయి. ఈయన వెతుకుతున్న యశోదకు దొరకకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళి స్తంభముల చాటున నక్కుతూ తిరిగాడు. అమ్మా! నేనింక ఎప్పుడూ దొంగతనం చేయను. ఎవరింటికీ వెళ్ళను. వెన్న తిననే తినను. నన్ను కొట్టకు’ అని కళ్ళు నులిమేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అరిచెయ్యి అంతా కాటుకయి బుగ్గలన్నీ కాటుక అయింది. ఈ లీల జరుగుతుంటే ముప్పైమూడుకోట్లమంది దేవతలు, పార్వతీ సహితుడై ఈశ్వరుడు, బ్రహ్మగారు ముక్కున వేలు పెట్టుకుని చూసారు. ఆయన ఆ రోజున అంత భయమును నటించాడు. అమ్మ ఎటునించి వస్తుందోనని క్రీగంట చూస్తూ పరుగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి దొరికిపోయాడు. కొడదామనుకుని చేయి ఎత్తింది. కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్న చిన్నికృష్ణుని ముఖం చూసేసరికి కొట్టలేక ‘నిన్ను కట్టేస్తాను’ అని మాత్రమే అనగలిగింది. యశోద ఎంత అదృష్టవంతురాలో. ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. ఆమె కృష్ణుడిని కట్టెయ్యడము కోసమని తాడుకోసం వెతుకుతున్నది. అక్కడ అంతకు ముందు కవ్వమునకు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి. వాటితో కట్టాలని తెచ్చి బొజ్జ చుట్టూ తిప్పుతోంది. తిప్పితే రెండు అంగుళములు తక్కువ వస్తోంది. ఎన్ని తాళ్ళుతెచ్చి ముడివేసి కడదామనుకున్నా ఎప్పుడూ రెండు అంగుళములు తక్కువ వస్తోంది. చిక్కడు సిరి కౌగిటిలో, జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం జిక్కడు శృతిలతికావలి, జిక్కె నతడు లీల దల్లి చేతన్ రోలన్! ఆయన లక్ష్మీదేవి కౌగిలించుకుందామనుకుంటే ఆమె కౌగిలికి దొరకని వాడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కనివాడు, వేదమంత్రములకు దొరకని వాడు, ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడినాడు. చివరికి యశోదాదేవి కృష్ణుడిని త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. నిజంగా కొడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి, ఒంటిమీద శ్రీవత్సం తప్ప మరొక మచ్చలేని స్వామికి, పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది. రెండు అంగుళముల తాడు తక్కువ అవడం అంటే భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మరిచిపోవాలి. నా స్వామికి ఇది చేయకుండా నేను ఎలా ఉండగలను? అనే భావన పెరగాలి. మీరు చేసిన పూజకు కోరిక ఉండదు. ఒక ప్రయోజనమును ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అన్న ఈ రెండు భావనలను మరిచిపోతారు అదీ విచిత్రం. పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ రెండు భావనలను మరచి పోవడమే తాడు రెండు అంగుళములు తక్కువ అవుతున్నదనే విషయమును మరిచిపోవడం. అలా ఎలా తక్కువవుతున్నదని తెలియక పోవడం. ఇటువంటి తాదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలము భక్తి చేత పరమాత్మ వశుడు అవుతాడు. జ్ఞానులచే మౌనులచే, దాసులచే యోగసంవిధానుల చేతం బూని నిబద్ధుండగునే, శ్రీనాథుడు భక్తి యుతుల చేతం బోలెన్? మౌనముగా వున్న వాళ్లకు, జ్ఞానులకు, ధ్యానం చేసేవాళ్ళకు, దానం చేసేవాళ్ళకు భగవంతుడు యిలా లొంగుతాడని చెప్పలేము. కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా, అది ఉద్ధరించి ఈశ్వరుని కట్టి మీ దగ్గరకు తీసుకువచ్చి నిలబెట్టగలదు. అది కేవలం భక్తికే సాధ్యం. ఇక్కడ పరమాత్మ యశోద భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు