బాలికపై సామూహిక అత్యాచారం - Darsi Live News

బాలికపై సామూహిక అత్యాచారం - Darsi Live News

రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడుగురు దుండగులు ఓ బాలికను కిడ్నాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కోరుకొండ మండలం మధురపూడిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, బాలిక తెలిపిన వివరాల ప్రకారం... మధురపూడికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమె రెండో కుమార్తె పదో తరగతి చదువుతోంది. పాఠశాలకు సెలవులు కావడంతో తల్లికి సాయపడాలనుకుంది. అదే గ్రామానికి చెందిన అనిత అనే మహిళ చెప్పుల దుకాణంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఈ నెల12న ఆ బాలికను రాజమహేంద్రవరం తీసుకెళ్లింది. సాయంత్రానికి బాలిక ఇంటికి రాకపోవడంతో అనితను బాలిక తల్లి ప్రశ్నించింది. తనకు తెలియదని అనిత చెప్పడంతో, బాలిక తల్లి కోరుకొండ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 16వ తేదీ రాత్రి కొందరు వ్యక్తులు బాలికను కోరుకొండ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బాలికను తల్లికి అప్పగించారు. బాలిక నీరసంగా ఉండటంతో తల్లి ఆమెను ఈ నెల 17న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్చించింది. దీంతో, అసలు విషయం బయటకొచ్చింది. బాలికను అనిత కొందరు ఆటో డ్రైవర్లకు అప్పగించింది. వారు బాలికను క్వారీ ప్రాంతంలోని ఓ ఇంట్లో బంధించారు. మత్తుమందు ఇచ్చి నాలుగు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కోరుకొండ పోలీసులు విచారణ చేపట్టారు. తన కుమార్తెకు న్యాయం చేయాలని బాలిక తల్లి కోరింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా (రాజమహేంద్రవరం) జిల్లా కార్యదర్శి పి.తులసి డిమాండ్‌ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి