ప్రకాశం జిల్లాలో రెండు గ్రామాల్లో వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల్లో శానిటైజర్‌ తాగి మృత్యువాత - Darsi Live News

ప్రకాశం జిల్లాలో రెండు గ్రామాల్లో వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల్లో శానిటైజర్‌ తాగి మృత్యువాత - Darsi Live News

రెండు గ్రామాల్లో వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల్లో మృత్యువాత 

లాక్‌డౌన్‌లో మద్యం లేక... ఉన్నా అధిక ధరలకు కొనలేక... 

సమగ్ర విచారణ జరిపిస్తాం : ఎస్‌పి సిద్ధార్థ్‌కౌశల్‌

కురిచేడు, పామూరు (ప్రకాశం జిల్లా) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దొరక్కపోవడం, దొరికినా అధిక ధరల కారణంగా కొనుగోలు చేయలేకపోవడంతో మత్తు కోసం కొందరు శానిటైజర్లను తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో 13 మంది మృతి చెందారు. వారిలో కురిచేడుకు చెందిన 11 మంది, పామూరుకు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ఘటనతో ఈ రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం అలముకుంది. అధికారుల కథనం ప్రకారం... కురిచేడు మండలంలో జులై తొలి వారంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ప్రారంభమయ్యాయి. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో 17వ తేదీ నుంచి కురిచేడు గ్రామంలోని రెండు మద్యం షాపులనూ పోలీసులు మూసివేయించారు. మద్యం దొరక్కపోవటంతో దానికి బానిసైన వారు తీవ్ర అవస్థలు పడ్డారు. చేతులను శుభ్రం చేసుకొనేందుకు వినియోగించే శానిటైజర్‌లో ఆల్కహాలు ఉంటుందనే ప్రచారంతో పలువురు వాటిని కొనుగోలు చేసి, అందులో కొందరు నీళ్లు, మరికొందరు కూల్‌డ్రింక్‌ కలుపుకొని తాగారు. తీవ్ర అస్వస్థతకు గురై 24 గంటల్లోనే 11 మంది మృతి చెందారు. కురిచేడులోని క్రిస్టియన్‌పాలెంకు చెందిన కూలీ కుందా అగస్టీన్‌ (47), రిటైర్డు ప్రభుత్వోద్యోగి (లస్కర్‌) పల్లెపోగు దాసు (65) గురువారం, యాచకుడు రాజారెడ్డి (65), యాచకుడు బాబు (40), కురిచేడుకు చెందిన ముఠా కార్మికులు భోగ్యం తిరుపతయ్య (29), అనకొండ శ్రీను (32), తిరుపతయ్య (35), ఆటో డ్రైవర్లు కడియాల రమణయ్య (20), షేక్‌ సైదా (30), రైతు గుంటక రామిరెడ్డి (51), కూలీ మాడుగుల ఛార్లెస్‌ (46) శుక్రవారం మృతి చెందారు. వీరిలో కొందరు శానిటైజర్‌ తాగిన చోటే ప్రాణాలు విడిచారు. మరికొందరు ఇళ్ల వద్ద మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన బనిగల శ్రీను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండల కేంద్రమైన పామూరులో ఇద్దరు అరటి పండ్ల చిరువ్యాపారులు మృతి చెందారు. వారిలో డి.మల్లికార్జున (38) గురువారం, టి.రోశయ్య (46) శుక్రవారం మృత్యువాతపడ్డారు. ఇదే గ్రామానికి చెందిన పాతిమా (30) వారం రోజుల క్రితం శానిటైజర్‌ తాగి చనిపోయింది. దీంతో, ఈ గ్రామంలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. కాగా, కురిచేడులో మృతి చెందిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలిందని అధికారులు తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేయిస్తాం : ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ కురిచేడు ఘటనపై అధికారులతో సమగ్ర దర్యాప్తు చేయిస్తానని ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు కురిచేడు వచ్చిన ఆయన ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బనిగల శ్రీనును వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుంటుబసభ్యులను ఎస్‌పి సిద్ధార్థ కౌశల్‌, దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి : చంద్రబాబు కురిచేడు ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కురిచేడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి