ప్రాణం తీసిన నిర్లక్ష్యం బ్రిడ్జి గోతిలో పడి వ్యక్తి మృతి ..... Darsi Live News

ప్రాణం తీసిన నిర్లక్ష్యం బ్రిడ్జి గోతిలో పడి వ్యక్తి మృతి ..... Darsi Live News

బ్రిడ్జి గోతిలో పడి వ్యక్తి మృతి

హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదం

దారి బాగుందని బైకు మీద వెళ్తూ..

రహదారి భద్రత పట్టని ఆర్‌అండ్‌బీ

రుద్రవరం(కర్నూలు): ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (45) అనే వ్యక్తి బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి మృతి చెందాడు. పెద్ద కంబలూరులోని తన అక్క వెంకటసుబ్బమ్మ వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చిన్నకంబలూరు మెట్ట-బి.నాగిరెడ్డిపల్లె మెట్ట మధ్యలో ఆర్‌అండ్‌బీ రహదారిలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.

దీని కోసం దారిలో భారీగా గుంతలు తవ్వారు. కానీ డైవర్షన్‌ బోర్డు, బారికేడ్లు, ప్రమాద సూచికల వంటివి అక్కడ ఏర్పాటు చేయలేదు. దీంతో దారి ఉందని భావించి బైక్‌పై వెళుతున్న వెంకటసుబయ్య గోతిలో అక్కడికక్కడే మృతి చెందాడు. కూలీలు సోమవారం ఉదయం అక్కడకు వెళ్లేదాక ఈ ఘటన గురించి ఎవరకీ తెలియదు. మృతుడికి భార్య సుబ్బలక్ష్మమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో ఇద్దరు మూగ, చెవిటివారు.

ప్రమాద సూచీలు లేనందుకే..

రుద్రవరం-మహదేవపురం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీని కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. మొత్తం 30 కి.మీ. రహదారి నిర్మించాల్సి ఉంది. పని ప్రదేశాల వద్ద సూచిక బోర్డులు, బారికేడ్లు, డైవర్షన్‌ బోర్డులు ఎక్కడా లేవు. బ్రిడ్జి నిర్మాణం కోసం భారీ గొయ్యి తవ్వినా, అక్కడ కూడా ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టలేదు. దీంతో దారి సరిగా ఉందనుకుని బైక్‌ను ముందుకు సాగనిచ్చిన వెంకట సుబయ్య ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

ఉదయమే రహదారి వెంట రాకపోకలు కొనసాగాయి. కానీ ఎవరూ గుర్తించలేదు. నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి గుర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

బిడ్డలను ఎలా పోషించాలి..?

భర్త మృతితో సుబ్మలక్ష్మమ్మ భోరున విలపించింది. తన బిడ్డల భవిష్యత్తు ఏమిటని రోదించింది. మూగ, చెవిటి పిల్లలను ఎలా పోషించాలని కన్నీరుమున్నీరైంది. ఆమె పరిస్థితి చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. 

అక్కతో ఆఖరి మాటలు..

పెద్ద కంబలూరులో ఉన్న తన అక్క వెంకట సుబ్బమ్మను కలిసేందుకు ఆదివారం రాత్రి వెంకటసుబ్బయ్య వెళ్లాడు. ‘అక్కా.. నా కూతురిని నీ కొడుక్కు చేసుకో..’ అని అడిగాడు. ఆ తరువాత స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియగానే వెంకట సుబ్బమ్మ ఘటనా స్థలానికి వచ్చి భోరున విలపించింది. తమ్ముడి ఆఖరి మాటలు గుర్తుకు చేసుకుని కన్నీరుమున్నీరైంది.

డైవర్షన్‌ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం: సుబ్బరాయుడు, ఆర్‌అండ్‌బీ డీఈ, నంద్యాల 

రుద్రవరం-మహదేవపురం ఆర్‌అండ్‌బీ రహదారి పనుల్లో డైవర్షన్‌ సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం. ఆ తర్వాతే బ్రిడ్జిలు, కల్వర్టులకు మార్కింగ్‌ ఇస్తాం. సూచిక బోర్డులపై కాంట్రాక్టర్లకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటాం. 

Advertisements : 
SPS DEGREE COLLEGE DARSI
ADMISSIONS OPEN 
Contact Admissions : 9390064255
P PEDDI RAJU

SRI POTTI SRIRAMULU DEGREE COLLEGE 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి