నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో మహిళల్ని భయపెట్టిన యువకుడు - Darsi Live News

నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో మహిళల్ని భయపెట్టిన యువకుడు - Darsi Live News

మహిళల ఫొటోల్ని మార్ఫింగ్ చేస్తూ...బెదిరింపులకు పాల్పడుతూ 

నకిలీ సోషల్ మీడియా ఖాతాలతో మహిళల్ని భయపెట్టిన యువకుడు

కన్నింగ్ మైండ్ కలిగిన కేటుగాణ్ణ్ని అరెస్ట్ చేసిన గుంటూరు రూరల్ పోలీసులు

వివరాలు వెల్లడించిన గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ యాండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేసే కుర్రాడు తనదైన రోజున మహిళల ఫొటోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇప్పుడతని పాపం పండి పోలీసుల చేతికి చిక్కాడు. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కేటుగాడి కథను బుధవారం గుంటూరులో మీడియాకు వివరించారు. గుంటూరు రూరల్ జిల్లా నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజు గడ్డ రఘబాబు కేరళలో బీఎస్సీ యానిమేషన్ మల్టీమీడియా పూర్తి చేసి ప్రస్తుతం తన స్వగ్రామంలోనే నివసిస్తూ తనతో చదువుకున్న యువతులతో ఇన్స్టాగ్రామ్, వాట్సప్ ల ద్వారా పరిచయాన్ని పెంచుకొని వారి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి మరిన్ని న్యూడ్ ఫొటోలు పంపించాలని లేకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో ఎస్పీ విశాల్ గున్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సమస్యలుంటే స్పందించాలని తన నెంబర్ ని రూరల్ జిల్లా ప్రజలకు కోసం ప్రకటించారు. దీంతో ఈ కేటుగాడి కథలోని ఓ బాధిత యువతి ధైర్యంతో ఎస్పీ విశాల్ గున్నీకి తన బాధను సందేశం రూపంలో పంపించింది. దీంతో ఎస్పీ విశాల్ గున్నీ బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, రేపల్లె రూరల్ సీఐ జి.శ్రీనివాసరావు, నగరం ఎస్సై ఎం.వాసు, ఐటీకోర్ సిబ్బందిని ఈ ఘటన పై దర్యాప్తు కు ఆదేశించారు. గత కొద్దిరోజులుగా ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. *ఈ మేరకు సోషల్ మీడియాని వినియోగించే యువతీ, యువకులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు.* 1.సోషల్ మీడియాలో పరిచయమైన స్నేహితుల్ని గుడ్డిగా నమ్మకుండా ముందుగా వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి. 2. మీకు పరిచయం లేని వ్యక్తులు పోస్టులు పెట్టినా నమ్మొద్దు. మీతో పరిచయం ఉన్న వ్యక్తులు మిమ్మల్ని రహస్య సమాచారాన్ని అడుగుతూ ఒక ప్రైవేటు సందేశాన్ని పంపితే...ఆ వ్యక్తులు నిజంగా మీకు సందేశాన్ని పంపించారో లేదో ధృవీకరించుకోండి. ఎందుకంటే మీతో పరిచయం ఉన్న వ్యక్తుల ఎకౌంట్ ని..కూడా కొత్తగా పరిచయం అవ్వాలని చూస్తున్న వారు హ్యాక్ చేసి ఉండొచ్చు. 3.సోషల్ నెట్వర్కింగ్ ని వ్యక్తిగత వినియోగానికి మాత్రమే పరిమితం చేయాలి. 4.కొత్త వ్యక్తులతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.