Live Blog కోవిడ్-19 Coronavirus Latest Updates - DARSI LIVE NEWS

Live Blog కోవిడ్-19 Coronavirus Latest Updates - DARSI LIVE NEWS

మధ్యప్రదేశ్‌లో 73 మందికి పాజిటివ్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో 73 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,788కి పెరిగింది. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 151కి చేరింది.

కరోనాతో లోక్‌పాల్‌ సభ్యుడు కన్నుమూత

దిల్లీ: లోక్‌పాల్‌ సభ్యుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌కుమార్‌ త్రిపాఠి (62) కరోనాతో శనివారం కన్నుమూశారు. ఏప్రిల్‌ 2 నుంచి ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

తెలంగాణలో కొత్తగా 17 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 35 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా.. 499 మంది డిశ్చార్జి అయ్యారు. 533 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తితిదే ఉత్తర్వులు.. విధుల్లోకి 1300 మంది సిబ్బంది

తిరుపతి: కంట్రాక్ట్‌ ఏజెన్సీ పద్మావతి ఎఫ్‌ఎంఎస్‌ గడువును పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్‌ కాలాన్ని ఈనెల చివరి వరకు పొడిగిస్తూ తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. పద్మావతి ఏజెన్సీ ద్వారా దాదాపు 1300 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కాంట్రాక్ట్‌ గడువు పొడిగించడంతో కార్మికులను తితిదే విధుల్లోకి అనుమతించింది.

వారు నిజమైన హీరోలు: కేటీఆర్‌

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో ముందు వరుసలో నిలబడి విశేష కృషి చేస్తోన్న ప్రతిఒక్కరికి మంత్రి కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారామెడికల్‌ స్టాఫ్‌ చేస్తున్న సేవలను కొనియాడుతూ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతోన్న బాధితులకు ప్రాణం పోసి దేశ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారని తెలియజేస్తూ ఓ వీడియోను జతచేశారు.

మంగళగిరి కొవిడ్‌ ఆస్పత్రి నుంచి 32 మంది డిశ్చార్జ్‌

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై కొవిడ్‌ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకున్న 32 మందిని వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. గుంటూరు నగరానికి చెందిన వారు 11 మంది, నరసరావుపేటకు చెందిన 20 మంది, పొన్నూరుకు చెందిన ఒకరిని డిశ్చార్జ్‌ చేసినట్టు వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన బాధితులను ప్రత్యేకాధికారి రాజశేఖర్‌, కలెక్టర్‌ పరామర్శించారు. వారంతా 14 రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

మహారాష్ట్రలో ఒక్కరోజే 790 కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 790 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,296కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 36 మంది మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 521కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

గుజరాత్‌లో 24గంటల్లో 333 కేసులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లోనే 333 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాటివ్‌ కేసుల సంఖ్య 5054కి పెరిగింది. ఇప్పటివరకు 262 మంది ప్రాణాలు కోల్పోగా.. 896మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి: పవన్‌

విజయవాడ: కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం( తితిదే)లో పనిచేస్తున్న 1400 మంది అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను తొలగించడం అన్యాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించినా తితిదే పెద్దలు మాత్రం ఒక్క కలంపోటుతో ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగింపునకు గురైన వాళ్లంతా 15 ఏళ్లుగా పనిచేస్తూ స్వల్ప జీతాలు తీసుకొనే చిరుద్యోగులేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, తితిదే ట్రస్టు బోర్డుకి  జనసేనాని విజ్ఞప్తి చేశారు. 

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి