మాస్క్‌ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై దాడి - Darsi Live News

మాస్క్‌ పెట్టుకోమన్నందుకు ఉద్యోగినిపై దాడి - Darsi Live News

ఎపి టూరిజం డిప్యూటీ మేనేజర్‌ అరెస్టు-నిర్భయ చట్టం కింద కేసు * విధుల నుంచి సస్పెన్షన్‌

మాస్కు పెట్టుకోవాలని సూచించిన మహిళ ఉద్యోగినిపై ఎపి టూరిజం శాఖ డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు డిఎంను అరెస్టు చేశారు. భాస్కర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు ప్రకటించారు. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు హోం మంత్రి తెలిపారు. బాధితురాలిని మహిళా కమిషన్‌ చైర్మన్‌ పరామర్శించారు. ప్రత్యేక ప్రతిభావంతురాలైన ఉషారాణి నెల్లూరులోని ఎపి టూరిజం హోటల్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నారు. జూన్‌ 27న విధి నిర్వహణలో భాగంగా ఆమె వద్దకు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ వచ్చాడు. కరోనా నేపథ్యంలో 'మాస్కు కట్టుకొని మాట్లాడండి సార్‌' అని ఆమె సూచించారు. దీంతో, ఆగ్రహానికి గురైన ఆయన 'నాకే సలహాలు ఇస్తావా' అంటూ ఆమె జుట్టు పట్టుకుని లాగి కుర్చీలోంచి కిందపడేశాడు. కుర్చీ హ్యాండిల్‌తో దాడి చేశాడు. భయబ్రాంతులకు గురైన తోటి మహిళా ఉద్యోగులు కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతమంది ఉద్యోగులు అడ్డుకోవడంతో డిఎం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉషారాణి ఫిర్యాదు మేరకు పోలీసులు డిఎంను అరెస్టు చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఎం.శ్రీనివాసరావు స్పందించారు. భాస్కర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. కఠినంగా శిక్షించాలి : ఐద్వా మహిళ ఉద్యోగిపై దుర్మార్గంగా దాడికి పాల్పడడాన్ని ఐద్వా రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. డిఎంపై తక్షణమే కఠిన చర్యలు తీసు కోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. భాస్కర్‌ను కఠినంగా శిక్షించా లని ఎపి ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జెఎసి చైర్మన్‌ ఎ.వి.నాగేశ్వర రావు మరో ప్రకటనలో కోరారు. నిర్భయ కేసు నమోదు : హోం మంత్రి డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైరపర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఘటన పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు. భాస్కర్‌ను సస్పెండ్‌ చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకోవడం సరికాదని ట్విట్టర్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి